Fri. Nov 8th, 2024
Justice-Abdul-Nazeer

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ, ఫిబ్రవరి 24,2023: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా శుక్రవారం జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం చేసిన నూతన గవర్నర్ కు పలు పార్టీల నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

కర్ణాటకాకు చెందిన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌..

Justice-Abdul-Nazeer

జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 1958 జనవరి 5న కర్ణాటకలోని మూడబిదరి తాలూకా బెలువాయిలో జన్మించారు. బాల్యం అంతా మూడబిదరిలోనే సాగింది. అక్కడి మహావీర కళాశాలలో బీకాం చేసిన ఆయన, మంగళూరు కొడియాల్‌బెయిల్‌ ఎస్‌డీఎం లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు.

అనంతరం 1983 ఫిబ్రవరి 18న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

2004 సెప్టెంబర్‌ 24న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై గతనెల జనవరి నాలుగో తేదీ వరకు సర్వోన్నత న్యాయస్థానంలో సేవలందించారు.

error: Content is protected !!