365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 15,2023: రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటల సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణ పథకం అమలులో భాగంగా వనపర్తి జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో పైలెట్ ప్రాజెక్టు కింద 48 రైతుల కు చెందిన 224 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగిందని వనపర్తి జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖాధికారి సురేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆ తోటలు ప్రస్తుతము 3వ సంవత్సరంలో కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు అనగా మే15 తేదీ నాడు జిల్లాలో తొలిసారిగా శ్రీరంగాపూర్ మండలము కంబళ్ళాపూర్ గ్రామములొ రైతు ఆనందరెడ్డి తోటలో ఆయిల్ పామ్ గెలలను కోశారు.
తొలి కాతగా ఒక చెట్టు నుంచి 47.100 కిలోల పూర్తిగా పండిన తాజా పండ్ల గుత్తులు కత్తిరించి, నేటి మార్కెట్ ధర (టన్నుకు రూ.14,200/-) చొప్పున రూ.669/- రైతుకు ప్రీయూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ ద్వారా చెల్లించడం జరిగింది.
నూనె తీయడానికి సేకరించిన గెలలను అశ్వరావ్ పేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల ఆయిల్ పామ్ ప్యాక్టరీకి తరలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖాధికారి సురేశ్ తో పాటు, ఆయిల్ పామ్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ రామ్ మోహన్ రావ్, ఉద్యాన అధికారి కృష్ణయ్య రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.