365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,యాదాద్రి భువనగిరి జిల్లా, మే 27, 2023: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) హైదరాబాద్ విభాగం శనివారం ప్రపంచ రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో పుట్టపాక గ్రామంలోని మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఋతు పరిశుభ్రత దినోత్సవాన్ని ప్రతి ఏటా మే 28న ఋతు పరిశుభ్రత నిర్వహణ,ప్రాముఖ్యతను తెలిపేందుకు జరుపుతారు. ఈసందర్భంగా గ్రామీణ మహిళలకు రుతు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. పుట్టపాక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా మహిళలను ఉద్దేశించి రీతూ షా మాట్లాడుతూ.. ‘ఫ్లో సుస్ధిర ఆరోగ్యం అనే చొరవ కింద FLO ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, మేము ఈ గ్రామానికి రావడం ఇదే మొదటిసారి కాదు, ఇంతకుముందు చాలాసార్లు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగిందని చెప్పారు.
పుట్టపాకలో తయారయ్యే చీరలు చాలా ప్రత్యేకం. పుట్టపాక గ్రామం తెహ్లియా రుమాల్, చేతి రుమాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది అదృశ్యమై పోతున్న క్రాఫ్ట్, దీనిని ప్రోత్సహించడానికి ,పునరుద్ధరించడానికి మేము కృషిచేస్తాం” అని రీతూ షా తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి చేతుల మీదుగా నాలుగు వేల ఎనిమిది వందల శానిటరీ ప్యాడ్‌లు, రెండు మొబైల్ టాయిలెట్లు, శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మెషిన్, ఇన్సినరేటర్ (శానిటరీ ప్యాడ్స్ బర్నింగ్ మెషిన్)ని FLO పుట్టపాక గ్రామస్తులకు అందించింది.
ఈ సందర్భంగా FLO ఉచిత ఆరోగ్య శిబిరాన్ని కూడా నిర్వహించింది. 800 మందికి పైగా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపాక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు రీతూ షా ప్రకటించారు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రపంచ రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మంచి ఋతు ఆరోగ్యం, పరిశుభ్రత చాలా ముఖ్యం. మంచి పద్ధతులు అంటువ్యాధులను నివారిస్తాయి. అవి దుర్వాసనలను కూడా తగ్గిస్తాయి.
మీ పీరియడ్స్ సమయంలో మీరు సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడతాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది అని ఆమె పేర్కొన్నారు.
ఎఫ్‌ఎల్‌ఓ సభ్యురాలు సీతారెడ్డి మాట్లాడుతూ శానిటరీ ప్యాడ్‌లను సురక్షితంగా పారవేయడం ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ పారవేయబడిన శానిటరీ ప్యాడ్‌లు భూమిలోకి కుళ్ళిపోవడానికి 500 సంవత్సరాలు పడుతుందని చెప్పారు.
ప్రతి ఒక్కరూ రుతుక్రమం విషయంలో జీవితకాలంలో 5000-15 000 ప్యాడ్‌ల మధ్య ఉపయోగిస్తారు. అందువల్ల, వారిని సురక్షితంగా దహనం చేయాల్సిన అవసరం ఉందని ఆమె కోరారు.
ఈ సందర్బంగా సానిటరీ ప్యాడ్స్ వెండింగ్ వాడిన ప్యాడ్లను ఎలా కాల్చాలనే దాని గురించి ఆయా యంత్రాలను ఎలా వాడాలో వివరించారు.
డాక్టర్ శ్వేతా అగర్వాల్ బహిష్టు పరిశుభ్రత, శారీరక ఆరోగ్యం గురించి మాట్లాడారు. పీరియడ్స్‌కు సంబంధించిన మూడు నియమాలను పాటించాలని చెప్పింది. ఒకటి పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం. రెండవ నియమం శానిటరీ ప్యాడ్లను ఉపయోగించడం. మూడు వాడిన ప్యాడ్‌లను పరిశుభ్రంగా పారవేయడం.
కొత్తగా పెళ్లయిన జంటకు పిల్లలు లేకుంటే, దంపతులిద్దరూ చెకప్ కోసం వెళ్లాలి. పిల్లలు కలగని మహిళలను నిందించవద్దు, ముప్పై ఏళ్లలోపు పిల్లలను కనడం మంచిదని ఆమె అన్నారు. మధ్య వయస్కులైన మహిళలు కనీసం సంవత్సరానికి ఒకసారి క్యాన్సర్ సంబంధిత పరీక్షలు చేసుకోవాలని ఆమె కోరారు. పీరియడ్స్ గురించి మాట్లాడుకోవడానికి ఎవరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.