365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 27,2023:ఎల్పిజి సిలిండర్లను మన ఇళ్లలో వంట చేయడానికి ఉపయోగిస్తారు. పెట్రోలియం వాయువును ద్రవ రూపంగా, ఎల్ఫీజీ (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) గ్యాస్ వంటని చాలా సులభతరం చేసింది. అయితే ఇది మన ఆరోగ్యానికి సురక్షితమేనా..? అంటే కాదని అంటున్నారు పరిశోధకులు.
ఎల్ఫీజీ గ్యాస్‌తో వండిన ఆహారం మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని, తద్వారా క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదానికి దారితీస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
కొత్త అధ్యయనం ప్రకారం గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు కేవలం మంటలు మాత్రమే కనిపిస్తున్నా వాస్తవంగా నిప్పుతో పాటు అనేక రకాల రసాయనాలు కూడా వెలువడతాయని, వాటిలో కొన్ని ఆరోగ్యానికి హానికరమని తేలింది. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సిగరెట్ల వలె ఈ గ్యాస్ ఆరోగ్యానికి హానికరం అని అధ్యయనంలో గుర్తించారు.
ఈ అధ్యయనంలో వెల్లడైన ప్రధాన విషయాలు..
LPG గ్యాస్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకునేందుకు పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో అనేక షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో, బెంజీన్‌తో సహా గ్యాస్ స్టవ్‌ల నుంచి వెలువడే 12 ప్రమాదకరమైన వాయు కాలుష్యాలను పరిశోధకులు గుర్తించారు. ఇందులో బెంజీన్ అనే ఒక రసాయనం కూడా ఉంది. ఇది క్యాన్సర్‌కు కారణం కావచ్చని వారు పేర్కొన్నారు.
స్టాప్ నుండే కాకుండా క్లోజ్డ్ స్టాప్ నుంచి కూడా బెంజీన్ వెలువడుతుందని ఆరోగ్య నిపుణులు గుర్తించారు. ఇది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఎంత హానికరమో అంతకంటే ఎక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అధ్యయనంలో ఏం తేలింది..?
PSE హెల్తీ ఎనర్జీ పరిశోధకులు కాలిఫోర్నియాలోని 16 కౌంటీలలోని 159 గృహాల నుంచి స్టవ్ గ్యాస్‌ను శాంపిల్ చేశారు. 99శాతం నమూనాలలో బెంజీన్‌ను కనుగొన్నారు. వంటగది పరిమాణం, గది వెంటిలేషన్ స్థాయి, ఎంత రసాయనం ఉంది. స్టవ్ ఆఫ్ చేసినప్పుడు అది లీక్ అవుతుందా..? వంటి అంశాల ఆధారంగా ఇంట్లో బెంజీన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను పరిశోధకులు అంచనా వేశారు.
కాలిఫోర్నియా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సెట్ చేసిన సురక్షిత ఎక్స్పోజర్ల స్థాయి కంటే స్టవ్‌ల నుంచి వచ్చే ఇండోర్ బెంజీన్ సాంద్రతలు ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఫలితాలు కనుగొన్నాయి.
బెంజీన్ నుంచి అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాలక్రమేణా బెంజీన్కు గురికావడం వల్ల ఒక వ్యక్తికిపలు రుగ్మతలు లేదా పునరుత్పత్తి సమస్యల ప్రమాదం పెరుగుతుందని పరిశోధకుల బృందం తెలిపింది.
ఈ రసాయనం లుకేమియా, మల్టిపుల్ మైలోమా, నాన్-హాడ్కిన్ లింఫోమా వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. క్యాన్సర్ ప్రమాదం విషయానికి వస్తే బెంజీన్ ఎక్స్పోజర్ సురక్షితమైన స్థాయి లేదని పరిశోధకులు అంటున్నారు.
అయితే స్టవ్‌ల నుంచి వచ్చే భయంకరమైన రసాయనం బెంజీన్ మాత్రమే కాదు, గ్యాస్ స్టవ్‌లు కూడా ఇండోర్ వాయు కాలుష్య ప్రమాదాన్ని పెంచుతున్నట్లు పరిశోధనలో తేలింది.
పరిశోధకులు ఏమి చెప్పారు..?
ఎల్పిజి గ్యాస్ స్టవ్‌ల వల్ల ఎనిమిది మంది పిల్లలలో ఒకరికి ఆస్తమా వచ్చే ప్రమాదం ఉందని మరొక అధ్యయనం కనుగొంది. గ్యాస్ స్టవ్‌లు ఆపివేసినప్పుడు కూడా బెంజీన్‌ను విడుదల చేస్తూనే ఉంటాయి. ఇది ధూమపానం చేసేవారితో సమానమని అధ్యయన రచయితలలో ఒకరైన ఎరిక్ లెబెల్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్‌పై ప్రజలు ఆధారపడే విధానం, దాని వినియోగాన్ని ఎలా తగ్గించవచ్చనేది ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతం, ఆహారాన్ని రక్షిత కవర్లో ఉడికించడం, వంటగదిలో మంచి వెంటిలేషన్ ఉండేలా చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.