Fri. Dec 13th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, అక్టోబరు 17,2023 : శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శ్రీమలయప్ప స్వామివారు యోగనరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

సింహ వాహనం – ధైర్య‌సిద్ధి

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్నిఅధిరోహించారు.సింహం పరాక్రమానికి,ధైర్యానికి, తేజస్సుకు,ఆధిపత్యానికి,మహాధ్వనికి సంకేతం.ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో‘సింహదర్శనం’అతి ముఖ్యమయింది.

సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌ మ‌వుతాయి.సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను,నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
error: Content is protected !!