365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,అక్టోబరు 17,2023: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు బకాసురవధ అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు.
సకల సౌభాగ్య సిద్ధి
ముత్యాలు నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం.
ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుంచి విడుదలై మోక్షాన్ని పొందుతుంది.
ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిని, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.