365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 10,2023: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రిలో మాజీ సీఎం చంద్రశేఖర్ రావును పరామర్శించారు. ఆయనకు అవసరమైన చికిత్స అందించాలని, అవసరమైతే.. ఆయన తొందరగా కోలుకోవడానికి సహాయ, సహకారాలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, సంబంధిత అధికారులను ఆదేశించినట్లు రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు.
తుంటికి శస్త్ర చికిత్స చేసి కోలుకుంటున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం కలిశారు.

“నేను కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలని అభ్యర్థించాను” అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలకు సుపరిపాలన రావాలంటే ఆయన సలహా కావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కెసిఆర్ కు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎడమ తుంటికి శస్త్రచికిత్స జరిగింది. డిసెంబర్ 8న కెసిఆర్ తన నివాసంలో కిందపడి గాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నుంచి ఎనిమిది వారాల్లో కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు.