365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 21,2024: 2047 నాటికి వ్యవసాయ రంగంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని విశ్వవిద్యాలయం కులపతి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. భాగస్వాముల అందరితో సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలో పురోగతి సాధించాలని సూచించారు.
రాజేంద్రనగర్ లో రెండు రోజులపాటు జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రాజేంద్రనగర్ లోని PJTAU క్రీడా మైదానంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనల్ని ప్రారంభించారు. వివిధ స్టాళ్లను పరిశీలించారు. తర్వాత ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
వజ్రోత్సవాల మీనియేచర్ పైలాన్ ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, PJTAU ఉపకులపతి అల్దాస్ జానయ్య తో కలిసి ప్రారంభించారు. కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ గుర్తింపు పత్రాలని అందజేశారు. తర్వాత విశ్వవిద్యాలయం అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించారు.
![](http://365telugu.com/wp-content/uploads/2024/12/AgricultureResearch.jpg)
60 ఏళ్లుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ అభివృద్ధికి అసమాన సేవల్ని అందించిందన్నారు. సొనామసూరి, తెలంగాణ సోనా వంటి వంగడాలు రూపొందించిందన్నారు. భవిష్యత్ ప్రణాళికల అమలులో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి అధునాతన పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని గవర్నర్ సూచించారు. భారతీయ స్టేట్ బ్యాంక్ సహాయంతో విశ్వవిద్యాలయం త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ నీ ప్రారంభించడం అభినందనీయమన్నారు.
వ్యవసాయ విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫీజులు తగ్గించడం స్వాగతించదగినదన్నారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదం ఇచ్చిన మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చేతుల మీద ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం వాతావరణ మార్పులు వంటి కొత్త సవాళ్లని ఎదుర్కొని మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గవర్నమెంట్ పిలుపునిచ్చారు. ఉదయం ఉత్సవాల ప్రారంభ సదస్సులోనూ.
![](http://365telugu.com/wp-content/uploads/2024/12/AgricultureResearch.jpg)
స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన కిసాన్ మేళా లోను తుమ్మల నాగేశ్వరరావు రైతులని ఉద్దేశించి ప్రసంగించారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం భవిష్యత్తులో దేశానికి దిక్సూచిగా మారాలన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలు, మన నేల స్వభావానికి తగ్గట్లుగా అనువైన పంటలు, అందుకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలను రైతులకు అందించాలని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకి ఆయన సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వ్యవసాయ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు. రైతు బీమా, రైతు రుణమాఫీలతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసాను అమలు చేస్తామన్నారు. హార్టికల్చర్, పంటలు, కూరగాయలు పామాయిల్ సాగు పెరగాలన్నారు. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి చేయుతనిస్తామన్నారు.
భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో వ్యవసాయ పట్టభద్రులు రావాలని వ్యవసాయ రంగంలో అధిక జనాభా నిమగ్నం కావాలని తుమ్మల ఆకాంక్షించారు. దేశ ప్రధానుల చేతుల మీద ప్రారంభమైన విశ్వవిద్యాలయం రైతాంగానికి ఎల్లప్పుడూ చేదోడువాదోడుగా ఉందని ఆయనన్నారు. గత కొన్నేళ్లుగా ఈ విశ్వవిద్యాలయం వెనుకబాటుకి గురి అయింది అని.. దాని అధిగమించి పూర్వ వైభవం తీసుకురావటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
![](http://365telugu.com/wp-content/uploads/2024/12/AgricultureResearch.jpg)
ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ఉపయోగించుకుని పరిశోధన, విస్తరణ విద్యలో ముందుకెళ్లాలని మంత్రి సూచించారు. రానున్న రోజుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి 10 ర్యాంకుల్లో నిలవాలని తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందన్నారు.
ప్రతి వ్యవసాయ కళాశాల పరిధిలో ఒక “మోడల్ అగ్రికల్చర్ ఫార్మ్” ను అభివృద్ధి చేయాలన్నారు. వాతావరణ మార్పుల కనుగుణంగా కరి కులమ్ లో రీసెర్చ్ లో మార్పులు తీసుకురావాలని, ఆర్టిఫిషియల్, డిజిటల్ టెక్నాలజీలను వినియోగించుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వజ్రోత్సవ ఉత్సవాల ప్రారంభ సమావేశంలో భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రస్తుత ఉపకులపతి అల్దాస్ జానయ్య తో తనకు పూర్వం నుంచి పరిచయం ఉందని ఆయన నాయకత్వంలో విశ్వవిద్యాలయ అభివృద్ధి పథాన సాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత విజయాలతో సంతృప్తి చెందకుండా భవిష్యత్తు లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలన్నారు.
నిధుల లభ్యత తగ్గడం వల్ల పరిశోధనలు వెనుకబడుతున్నాయని ఆ విషయంపై దృష్టి సారించాలన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆహార ధాన్యాల ఉత్పాదక గణనీయంగా పెరిగిందన్నారు. తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాలు, ఆహార ధాన్యాలు ఉత్పత్తి బాగా పెరిగిందన్నారు. అయితే కూరగాయలు, ఉద్యానవన పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని దీన్ని అధిగమించాలన్నారు.
![](http://365telugu.com/wp-content/uploads/2024/12/AgricultureResearch.jpg)
అదేవిధంగా వ్యవసాయ విద్యనభ్యసించిన వాళ్ళు కేవలం ఉద్యోగాల కోసమే చూడకుండా ఎంటర్ ప్రెన్యూర్ లుగా తయారు కావాలని రమేష్ చంద్ సూచించారు. గతంలో రైతులకి దక్కిన గౌరవం నేడు దక్కడం లేదని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ M. కోదండ రెడ్డి అన్నారు. రైతుకి వ్యవసాయానికి మూలమైన విత్తనాలు 90 శాతం ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లడం దురదృష్టకరమని ఆయనన్నారు.
ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు, వ్యవసాయ సంక్షేమం ప్రథమ ప్రాధాన్యాలని అందుకు అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పనిచేయాలన్నారు. శాస్త్రవేత్తలు గ్రామాల్ని దత్తత తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో సహకార వ్యవసాయ విధానం అవసరమని కోదండ రెడ్డి అన్నారు. రైతు సుఖంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
భూమి, విత్తనం, నీరు, రైతు చెమట వ్యవసాయానికి ఆధారాలన్నారు. మన వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశానికి తలమానికంగా ఉండాలని ఆకాంక్షించారు. పురుగుమందుల రహిత వ్యవసాయం కోసం మనమందరం కృషి చేయాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సందర్శించడం గొప్ప అనుభవం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నా రెడ్డి అన్నారు.
![](http://365telugu.com/wp-content/uploads/2024/12/AgricultureResearch.jpg)
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమధ్య ప్రధాని 131 కొత్త వంగడాలు విడుదల చేశారని వాటిలో కనీసం మన విశ్వవిద్యాలయం వంగడాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు.
విద్య, పరిశోధన, విస్తరణల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ జన్యు మార్పిడి పంటల సాగు నీ అనుసరించవలసిందేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇక్రిసాట్, క్రిడా వంటి సంస్థల సహకారం తీసుకోవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీలని వ్యవసాయ రంగంలో విస్తృతంగా వినియోగించుకోవాలని చిన్నారెడ్డి సూచించారు.
రైతుల కష్టాలు నాటికి నేటికి అలానే ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ధరల పెరుగుదల, వాతావరణ మార్పులకి అనుగుణంగా రైతులకి చాలా చేయవలసి ఉందని ఆయన అన్నారు. వందేళ్ళ క్రితమే వ్యవసాయంగా ప్రాముఖ్యత గురించి మహాత్మా గాంధీ చెప్పారని మరో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సమరసింహా రెడ్డి అన్నారు.
వ్యవసాయానికి అవసరమైన అన్నింటిని రైతులకు అందుబాటులో ఉంచాలని సమరసింహారెడ్డి సూచించారు. 60 ఏళ్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తానాన్ని PJTAU ఉపకులపతి అల్దాస్ జానయ్య వివరించారు. నాటి ప్రధానులు లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ లు, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతి మొరార్జీ దేశాయ్ లు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారన్నారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయం చుట్టూ సుమారు 10 భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంస్థలు ఉన్నాయన్నారు. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వల్ల హైదరాబాద్ విత్తన రాజధానిగా రూపొందిందని జానయ్య వివరించారు. 60 ఏళ్లలో సుమారు 500 వంగడాలని విడుదల చేశామన్నారు. అదేవిధంగా సుమారు 32 వేల మంది గ్రాడ్యుయేట్లు బయటకొచ్చారన్నారు.
![](http://365telugu.com/wp-content/uploads/2024/12/AgricultureResearch.jpg)
12 రాష్ట్రాల్లో సుమారు 3 కోట్ల ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపొందించిన వరి విత్తనాలు సాగు చేస్తున్నారని తెలిపారు. ఇతర పంటల్లోనూ విశ్వవిద్యాలయం రూపొందించిన వంగడాలు విస్తృత వ్యాప్తి పొందాయన్నారు. 21 పేటెంట్లు సాధించామన్నారు అలాగే పౌల్ట్రీ, పశుసంవర్ధక రంగాల్లోనూ వ్యవసాయ విశ్వవిద్యాలయం అపూర్వ ప్రగతి సాధించిందని అల్దాస్ జానయ్య అన్నారు.
ఈ సందర్భంగా 60 ఏళ్ల విశ్వవిద్యాలయం ప్రయాణం పై ఒక లఘు చిత్రాన్ని విడుదల చేశారు. అలాగే వివిధ సాగు పద్ధతులపై అనేక ప్రచురణల్ని కూడా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, వ్యవసాయ శాఖ కార్యదర్శి APC రఘునందన్ రావు, కమిషనర్ బి. గోపి, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ బాల్ రాజు, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డి. రాజి రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, పద్మశ్రీ గ్రహీతలు చింతల వెంకటరెడ్డి, Y. వెంకటేశ్వర రావు, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు రఘువర్ధన్ రెడ్డి, రాఘవ రెడ్డి, పద్మరాజు, వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రభాకర్ రావు, పూర్వ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కిసాన్ మేళా వేదికపై పలువురు తమ రైతులకు ఈ సందర్భంగా అవార్డులను బహుకరించారు.