365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, డిసెంబర్ 27,2024: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే 450కి పైగా ఉత్సవాలలో అత్యంత సుదీర్ఘమైన 25 రోజుల అధ్యయనోత్సవాలు ఈ ఏడాది డిసెంబరు 30న ప్రారంభమై, 2025 జనవరి 23 వరకు ఘనంగా జరుగనున్నాయి.

సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు ఈ దివ్యప్రబంధ పాసుర పారాయణం ప్రారంభమవుతుంది.

ఈ సందర్భంగా స్వామివారి మహిమను గూర్చి 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధంలోని 4000 పాశురాలను శ్రీవైష్ణవ జీయర్ స్వాములు గోష్ఠిగానం చేస్తారు. ఈ పారాయణం 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో నిర్వహిస్తారు.

తొలి 11 రోజులను పగల్‌పత్తు,తరువాత 10 రోజులను రాపత్తు అని పిలుస్తారు.
22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు,
23వ రోజున రామానుజ నూట్రందాది,
24వ రోజున శ్రీవరాహస్వామి శాత్తుమోర,
25వ రోజున అధ్యయనోత్సవాలు ముగింపు వేడుకలు నిర్వహిస్తారు.
ఈ విశేషమైన ఉత్సవాలు భక్తులను ఆధ్యాత్మికంగా ప్రేరేపించి, స్వామివారి అనుగ్రహాన్ని పొందే సువర్ణావకాశాన్ని అందిస్తాయి.