365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 5, 2025 : హిప్నాటిజం పేరెత్తగానే మొట్టమొదట స్మరించాల్సిన వ్యక్తి డా.హిప్నో కమలాకర్ . నగరాల నుంచి పల్లెసీమల దాకా హిప్నాటిజం ప్రయోజనాలను చాటి చెప్పటం కోసం ఆయన నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రజలెప్పటికీ మరిచిపోలేరు.

కేవలం మీడియా మీదనే ఆధారపడి పోకుండా, ప్రజలకు ప్రత్యక్షంగా హిప్నాటిజం ప్రాక్టికాలిటీని తెలియజేయటం కోసం ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు ఆయన లేకపోయినా ప్రజలు హిప్నాటిజాన్ని, హిప్నాటిస్టుల్ని ఆదరిస్తున్నారంటే, దానిగురించి అప్పట్లో ఆయన చేసిన ప్రచారమే కారణం.

హిప్నాటిజం విజ్ఞాన శాస్త్రమైతే.. హిప్నటైజ్ చేయటం ఒక కళ. ఆ విజ్ఞాన శాస్త్రం ఏ యూనివర్శిటీ కోర్సుల్లోనూ లభించక పోయినా… దాని గురించి ప్రపంచ వ్యాప్తంగా వున్న సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి డా.హిప్నో కమలాకర్, దాని లోతు పాతులను తెలుసు కోవటానికి పుస్తకాలు చదవటంతోనే సరిపెట్టక, వేలాది ప్రదర్శనలలో లక్షలాది మందిని హిప్నటైజ్ చేయటం ద్వారా అనుభవ పూర్వకంగా కూడా తెలుసు కున్నారు.

వాటినన్నిటినీ, “మోడరన్ హిప్నాటిజం” ” సెల్ప్ హిప్నాటిజం” పేరుతో పుస్తకాలు వెలువరించారు. డా.హిప్నో కమలాకర్, హిప్నాటిజం విజ్ఞానం ఏఏ రంగాలలో ఎవరికి ఎలా ఉపయోగపడ్తుందో… ఆయా రంగాలకు చెందిన వ్యక్తులతో సెమినార్లు నిర్వహించి తెలియజేసారు. విమర్శకుల నోళ్ళు మూయించారు.

” ఏ విజ్ఞాన శాస్త్రపు ప్రాధమిక సత్యాలన్నా ప్రజల వ్యతిరేకతను, అవహేళనను, తిరస్కారాన్ని చవిచూసి, కాల పరీక్షకు నిలబడి మాత్రమే విషయ సంపూర్ణతకు పునాదిరాళ్ళు కాగలిగాయనేది ఒక నగ్న సత్యం.

సమస్త విషయాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనే తీవ్ర జిజ్ఞాసతో వాట్నిటినీ పరీక్షల కొలిమిలోకి తోసేస్తే ఆ భగ భగమంటల్లో వాటికున్న అవాస్తవికతలనే తుప్పు, మకిల, దూగరలు వదిలి, రాయి బంగారాలు బయటపడతాయి.

అప్పుడే ఆ రెంటినీ వుపయోగించుకోగలిగే నిశ్చయ జ్ఞానం వెలువడుతుంది. ” అని డా.హిప్నో కమలాకర్, ఆయన పుస్తకంలో వ్రాసుకున్న మాటలు అక్షర సత్యాలే కాదు… నా అనుభవంతో తెలుసుకున్న నిజాలు కూడా.