365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 17, 2025: భారతీయ వరి పరిశోధన సంస్థ (IIRR),ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) మధ్య సోమవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం సంతకం కార్యక్రమం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిష్కార భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో PJTAU రిజిస్ట్రార్ డాక్టర్ G.E.Ch. విద్యాసాగర్, IIRR సంచాలకులు డాక్టర్ ఆర్. మీనాక్షి సుందరం, PJTAU ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య సమక్షంలో ఒప్పంద పత్రాలు సంతకాలు చేసి పరస్పర మార్పిడి చేసారు.

ఈ సందర్భంగా, ప్రొఫెసర్ జానయ్య మాట్లాడుతూ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పరిశోధనలు చేపట్టడం చాలా కీలకమని, వరిలో ఉత్పత్తి,ఉత్పాదకత పెంపుతో పాటు రైతులకు, వినియోగదారులకు కూడా ప్రయోజనాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
వరిలో కార్బన్ క్రెడిట్ ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనాలు అందించేందుకు సంబంధిత విధానాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. ఆయన మాట్లాడే ప్రకారం, వరిలో వాతావరణ మార్పులను తట్టుకునే రకాల రూపకల్పన ప్రస్తుత అవసరమని, తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 5 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తిని మిగులు ఉత్పత్తి చేస్తోందని చెప్పారు.
ఈ ఉత్పత్తిని ఎగుమతి చేయడం సరైన దిశలో ఉండాలని, అందుకోసం రైతులకు సాంకేతిక విషయాలపై అవగాహన కల్పించడం అవసరమని అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలో వరిదాన్యాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశం అయిన ఫిలిప్పైన్స్‌కు మన రాష్ట్రం నుంచి వరి ఎగుమతి చేసే అద్భుత అవకాశాలు ఉన్నాయని, ఇది ఒక ఆధునిక పరిశ్రమగా వరి పంట సాగును మార్చేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో IIRR సంచాలకులు డాక్టర్ ఆర్. మీనాక్షి సుందరం మాట్లాడుతూ, ఈ అవగాహన ఒప్పందం ఇరు సంస్థల మధ్య సమన్వయంతో రైతులకు మెరుగైన సేవలు అందించడంలో సహాయపడతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో PJTAU విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, IIRR శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.