365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, జూన్ 20, 2025 : మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఆడియో, వీడియో, లేదా కీలకమైన ఫైళ్లను భద్రంగా ఉంచుకోవాలన్నా, లేదా అనవసరమైన ప్రకటనల బెడద నుంచి విముక్తి పొందాలన్నా.. మీ ఫోన్‌లోనే చాలా పవర్‌ఫుల్ ప్రైవసీ ఫీచర్లు ఉన్నాయి.

అయితే, ఇవి సెట్టింగ్స్‌లో లోతుగా దాగి ఉండటం వల్ల చాలామందికి వాటి గురించి తెలియదు. నేటి టెక్నాలజీ యుగంలో ‘స్మార్ట్ యూజర్లు’ మాత్రమే ఉపయోగించే అలాంటి మూడు అద్భుతమైన హిడెన్ సెట్టింగ్‌ల గురించి తెలుసుకుందాం.

ఫోన్ దొంగిలించినప్పుడు మీ డేటా భద్రం!

మీ వ్యక్తిగత డేటాను రక్షించుకోవడానికి గూగుల్ అనేక పటిష్టమైన భద్రతా ఫీచర్లను తీసుకొచ్చింది. దీనికోసం మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘సెక్యూరిటీ అండ్ ప్రైవసీ’ > ‘లాస్ట్ డివైస్ ప్రొటెక్షన్’ > ‘థెఫ్ట్ ప్రొటెక్షన్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

థెఫ్ట్ డిటెక్షన్ లాక్: ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఫోన్‌ను ఎవరైనా లాక్కుంటున్నారని స్క్రీన్ గుర్తిస్తే, అది ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. దీనివల్ల మీ ప్రైవేట్ డేటా సులభంగా ఇతరుల చేతికి చిక్కదు.

ఆఫ్‌లైన్ డివైస్ లాక్: ఆండ్రాయిడ్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ కూడా మీ ఫోన్‌కు రక్షణ కల్పిస్తుంది. రిమోట్ లాక్: అత్యంత కీలకమైన ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి ఉంటే, మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయి ఉన్న ల్యాప్‌టాప్ లేదా ఇతర డివైస్ ద్వారా మీ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి…వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్‌తో కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల విప్లవం – యాక్సిస్ బ్యాంక్, బోట్, మాస్టర్‌కార్డ్ సంయుక్తంగా ఆవిష్కరణ..

Read This also…Axis Bank Partners with boAt and Mastercard to Launch Contactless Payments on the New Wave Fortune Smartwatch..

అనవసరమైన ప్రకటనలకు ‘చెక్’ పెట్టండి..!

మీరు గూగుల్ సర్వీసులను ఉపయోగిస్తుంటే, మీ సెర్చ్ హిస్టరీ ఆధారంగా ప్రకటనలు కనిపించడం సాధారణమే. కొన్నిసార్లు ఈ అనవసర ప్రకటనలు విపరీతంగా పెరిగిపోతాయి. వీటిని పూర్తిగా ఆపలేకపోయినా, వాటి స్వభావాన్ని మార్చడం సాధ్యమే. ప్రతి గూగుల్ అకౌంట్‌కు ఒక ప్రత్యేకమైన ‘అడ్వర్టైజింగ్ ఐడీ’ (Advertising ID) ఉంటుంది, ఇది మీ ఆన్‌లైన్ యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది.

మీరు మీ డేటాను షేర్ చేయకూడదనుకుంటే, ఈ ఐడీని డిలీట్ చేయవచ్చు. దీనితో మీకు సరికొత్త రకాల ప్రకటనలు కనిపించడం మొదలవుతుంది. ఈ సెట్టింగ్‌ను మార్చడానికి, సెట్టింగ్స్ > గూగుల్ > ఆల్ సర్వీసెస్ > యాడ్స్ (Ads) పై క్లిక్ చేయండి. అక్కడ ‘డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడీ’ (Delete Advertising ID) ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మీ ఐడీ రీసెట్ అవుతుంది.

లాక్ స్క్రీన్ నోటిఫికేషన్‌లలోని గోప్యతకు రక్షణ..!

మీ ఫోన్ లాక్ స్క్రీన్‌పై OTPలు, బ్యాంక్ మెసేజ్‌లు లేదా వాట్సాప్ నోటిఫికేషన్‌లు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యమైన, సున్నితమైన సమాచారం ఉండే అవకాశం ఉంది. ప్రతి నోటిఫికేషన్ కోసం ఫోన్‌ను అన్‌లాక్ చేయడం మీకు ఎప్పుడూ సౌకర్యంగా ఉండకపోవచ్చు.

అలాంటి సమయాల్లో, మీరు ముఖ్యమైన కంటెంట్‌ను దాచిపెట్టవచ్చు. లాక్ స్క్రీన్‌పై నోటిఫికేషన్ వచ్చినప్పుడు, కేవలం యాప్ ఐకాన్ మాత్రమే కనిపిస్తుంది తప్ప, దానిలోని సమాచారం బయటపడదు. దీనికోసం సెట్టింగ్స్ > నోటిఫికేషన్స్ > లాక్ స్క్రీన్ నోటిఫికేషన్స్ > ‘హైడ్ కంటెంట్’ (Hide Content) అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.