365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, జూన్ 21, 2025 ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఈసారి ‘ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం’ అనే ప్రత్యేక థీమ్‌తో అలరించనుంది.
భారతదేశం ప్రపంచానికి అందించిన అపురూప బహుమతిగా భావించే యోగా.. మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందన్నది జగమెరిగిన సత్యం. ఈ పవిత్ర దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర, దాని ప్రాముఖ్యత, ఈసారి థీమ్ ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం..
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు..?
వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో పుట్టిన యోగా.. కేవలం ఓ వ్యాయామ పద్ధతి కాదు. ఇది శరీరానికి బలాన్ని, మనసుకు ప్రశాంతతను అందించే ఓ పరిపూర్ణ జీవన విధానం. ఋషులు, మునులు అభ్యసించిన ఈ యోగా.. నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి పర్యాయపదంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచడం, దానిని దైనందిన జీవితంలో భాగం చేసుకోవడాన్ని ప్రోత్సహించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
జూన్ 21నే ఎందుకు ఎంపిక చేశారు..?
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి జూన్ 21 తేదీని ఎంపిక చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి:
వేసవి అయనాంతం: ఉత్తరార్ధగోళంలో జూన్ 21 సంవత్సరంలోనే అతి పొడవైన రోజు. దీనిని వేసవి అయనాంతం (Summer Solstice) అని పిలుస్తారు. ఈ రోజున సూర్యకిరణాలు భూమిపై ఎక్కువ సమయం ప్రసరిస్తాయి. జ్యోతిష్య, ఆధ్యాత్మిక కోణాల్లో ఈ రోజుకు విశేష ప్రాధాన్యత ఉంది.
ఆదియోగి శివుడు: ఈ పవిత్రమైన రోజునే ‘ఆదియోగి’ శివుడు తన శిష్యులకు యోగా జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించాడని ప్రతీతి. అందుకే ఈ రోజును ‘యోగా మూలం’ అని కూడా వ్యవహరిస్తారు.

ఈ ఖగోళ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలను పరిగణనలోకి తీసుకునే జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఎంపిక చేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ చరిత్ర..
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆలోచనను మొదటిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తన ప్రసంగంలో ప్రతి పాదించారు. ఆయన ప్రతిపాదనకు 193 దేశాలలో 177 దేశాల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం చేసిన ప్రతిపాదనల్లో ఇది అత్యంత వేగంగా ఆమోదం పొందిన వాటిలో ఒకటి.
ఇది కూడా చదవండి..స్మార్ట్‌ఫోన్‌లోని ఈ ‘ప్రైవసీ’ సెట్టింగ్స్..!
Read This also…Axis Bank Partners with boAt and Mastercard to Launch Contactless Payments on the New Wave Fortune Smartwatch..
కేవలం 90 రోజుల్లోనే, 2014 డిసెంబర్ 11న, ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూన్ 21ని ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా జరుపుకోవడానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో, 2015 జూన్ 21న ప్రపంచం మొదటిసారిగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 థీమ్..
ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక కొత్త థీమ్‌ను నిర్ణయిస్తారు. ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 థీమ్ “ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం” (Yoga for One Earth, One Health).
ఈ థీమ్ “ఒక భూమి, ఒక ఆరోగ్యం” అనే ప్రపంచ ఆలోచనను ప్రోత్సహిస్తుంది. అంటే, మన భూమి ఆరోగ్యం, మనందరి ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, ఆరోగ్యక రమైన, స్థిరమైన భవిష్యత్తుకు ఇవి అత్యవసరమని ఈ థీమ్ సూచిస్తుంది. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, పర్యావరణ స్థిరత్వం ప్రాముఖ్యతను ఈ థీమ్ హైలైట్ చేస్తుంది.