హైదరాబాద్‌ను NDE 4.0 మోడల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం..
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 30, 2025: ఇండియన్ సొసైటీ ఫర్ నాన్-డెస్ట్రక్షన్ టెస్టింగ్ (ఐఎస్ఎన్ టి) హైదరాబాద్ చాప్టర్ 2025–26 సంవత్సరానికి తన నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది.
నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, పరిశ్రమాధారిత పరిశోధనల్లో అగ్రగామిగా ఉన్న సూర్యప్రకాశ్ గజ్జల ఈ చాప్టర్‌కు చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
ఈసీఐఎల్ లోని ఎన్ఎఫ్ సి క్యాంపస్‌లోని గురుకుల్ వేదికగా వారాంతంలో జరిగిన సమావేశంలో డా. కొమల్ కపూర్ (చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్) నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ప్రైవేట్ రంగం నుంచి రెండో చైర్మన్..
సూర్యప్రకాశ్ గజ్జల ప్రైవేట్ పరిశ్రమ నుంచి ఐఎస్ఎన్ టి చాప్టర్‌కు చైర్మన్‌గా ఎన్నికైన రెండో వ్యక్తి కావడం విశేషం. గతంలో ఈ పదవిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు చెందినవారే చేపట్టిన చరిత్ర ఉంది. సూర్యప్రకాశ్ ఆర్కిమెడీస్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
ఈ సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటి రూఫ్‌టాప్ విండ్మిల్ (గాలిమర)ను రూపొందించి, పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసింది. ఇది దేశవ్యాప్తంగా ప్రదర్శనలకు నోచుకుంది. గతంలో గజ్జల కేంద్ర మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ నుండి MSME జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.
ముఖ్య అతిథులుగా ప్రముఖులు..
ఆయన పదవీ స్వీకారోత్సవానికి బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్, ఐఎస్ఎన్ టి నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ డా. జైతీర్థ రాఘవేంద్ర జోషి, అలాగే మిదానీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. నారాయణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నూతన కార్యవర్గ సభ్యులు..
ఎన్నుకోబడిన నూతన కార్యవర్గ సభ్యుల్లో సలహాదారులుగా మోహన్ (చైర్మన్, మెట్సానిక్ ఇంజినీర్స్); ఉపాధ్యక్షులుగా డా. జి.వి. శివా రావు (DRDL), డా. కె. శ్రీనివాస్ (ASL), ఎం.ఎన్.వి. విశ్వనాథ్ (NFC, రిటైర్డ్), రవి (మిదాని); కార్యదర్శిగా డా. ఎం. ఫణి సూర్య కిరణ్ (DMRL); కోశాధికారిగా అతుల్ ఖన్నా (ఎండి, హోరిజాన్) ఉన్నారు.
చైర్మన్ సూర్యప్రకాశ్ గజ్జల ప్రణాళికలు..

తన పదవిని స్వీకరించిన అనంతరం సూర్యప్రకాశ్ గజ్జల మాట్లాడుతూ, “ఐఎస్ఎన్ టి నిపుణుల సంఘంగా మాత్రమే కాకుండా, ఒక ప్రభావవంతమైన శక్తిగా మారాల్సిన సమయం ఇది. మన బలం యంత్రాలు లేదా పద్ధతుల్లో కాదు మనుషుల్లో ఉంది” అని నొక్కి చెప్పారు. హైదరాబాద్ చాప్టర్ అభివృద్ధికి ఆయన మూడు ముఖ్యమైన వ్యూహాలను ప్రకటించారు:
హైదరాబాద్‌ను NDE 4.0 కోసం మోడల్ చాప్టర్‌గా తీర్చిదిద్దడం: స్థానిక పరిశ్రమలు, స్టార్టప్‌లతో కలిసి NDE 4.0 ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. “AI ఆధారిత తనిఖీలు నుంచి ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ వరకు – హైదరాబాద్ డిజిటల్ మార్పుకు నమూనా కేంద్రంగా మారాలి” అని ఆయన అన్నారు.
పరిశ్రమ–విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం: విద్యార్థి శాఖలను ప్రారంభించడం లేదా విస్తరించడం, నిపుణుల గెస్ట్ లెక్చర్లు నిర్వహించడం, ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించడం వంటివి దీనిలో భాగంగా ఉంటాయి. “మేము NDT భవిష్యత్తును మాత్రమే కాదు, దానిని నిర్వచించే నిపుణులను కూడా తీర్చిదిద్దాలను కుంటున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
చైతన్యవంతమైన, ఆధారభూతమైన వృత్తిపరమైన కమ్యూనిటీని రూపొందించడం: నెలవారీ జ్ఞాన మార్పిడి, మెంటర్షిప్ కార్యక్రమాలు ప్రారంభించి, సీనియర్ నిపుణులు, యువ వృత్తిపరుల మధ్య పరస్పర మార్పిడిని సాధించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
” ఐఎస్ఎన్ టి హైదరాబాద్ ఒక చైతన్యవంతమైన, సహకారవంతమైన వృత్తిపరమైన వేదికగా ఉండాలి. అది లోపాలను మాత్రమే గమనించకూడదు దిశలను నిర్దేశించాలి” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐఎస్ఎన్ టి పరిచయం..
ఇండియన్ సొసైటీ ఫర్ నాన్-డెస్ట్రక్షన్ టెస్టింగ్ (ఐఎస్ఎన్ టి) అనేది నాన్ డెస్ట్రక్షన్ టెస్టింగ్ (NDT) రంగానికి చెందిన వృత్తిపరుల కోసం ఏర్పాటైన జాతీయ వేదిక. శిక్షణ, వనరులు, పరిశోధన, జ్ఞాన మార్పిడికి అనేక అవకాశాలను కల్పిస్తుంది.
5000 మందికి పైగా సభ్యులతో, ISNT దేశవ్యాప్తంగా టెక్నీషియన్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, తయారీదారులు, విద్యావేత్తల సమ్మేళనంగా విస్తరించి ఉంది. ఐఎస్ఎన్ టివిద్య, పరిశోధన, జాతీయ-అంతర్జాతీయ సహకారం ద్వారా NDT శాస్త్రాన్ని ప్రోత్సహిస్తుంది.