365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 26,2025:కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలకమైన ప్రకటన చేసింది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని లేదా అసలు లేదని బ్యాంకులు లోన్ అప్లికేషన్లను తిరస్కరించలేవని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ముఖ్యంగా మొదటిసారి లోన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి గొప్ప ఉపశమనం.

ఆర్బీఐ మార్గదర్శకాలు

ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మొదటిసారి లోన్ తీసుకునేవారికి కనీస క్రెడిట్ స్కోర్ తప్పనిసరి చేయలేదని తెలిపారు.

2025 జనవరి 6న ఆర్బీఐ జారీ చేసిన ‘మాస్టర్ డైరెక్షన్’ ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కేవలం క్రెడిట్ హిస్టరీ లేదన్న ఒకే కారణంతో లోన్ అప్లికేషన్లను తిరస్కరించకూడదు.

అయితే, దీని అర్థం బ్యాంకులు ఎటువంటి తనిఖీ లేకుండా లోన్ ఇస్తాయని కాదు. లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం, ఆర్థిక విశ్వసనీయత వంటి అంశాలను బ్యాంకులు పరిశీలిస్తాయి.

అభ్యర్థి యొక్క క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (CIR), గతంలో తీసుకున్న లోన్లు, సెటిల్‌మెంట్, రీస్ట్రక్చరింగ్ లేదా డిఫాల్ట్ హిస్టరీ వంటి వివరాలను పరిశీలించి లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారు.

క్రెడిట్ రిపోర్ట్ ఫీజు

ఆర్బీఐ నిబంధనల ప్రకారం, క్రెడిట్ రిపోర్ట్ కోసం ఫీజు రూ. 100 మించకూడదు.

ప్రతి వ్యక్తికి తన క్రెడిట్ హిస్టరీ ఉంటే, ఏడాదికి ఒకసారి క్రెడిట్ స్కోర్‌తో సహా పూర్తి క్రెడిట్ రిపోర్ట్‌ను ఉచితంగా పొందవచ్చు.

సిబిల్ సంస్థపై స్పష్టత

సిబిల్ సంస్థను మూసివేయడం లేదని, దానికి బదులుగా ఏ ఇతర ప్రభుత్వ సంస్థను తీసుకురాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సిబిల్ మరియు ఇతర క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలు ఆర్బీఐ పర్యవేక్షణలో పనిచేస్తూనే ఉంటాయి.

ఈ మార్పు వల్ల యువత, చిన్న వ్యాపారులతో సహా తొలిసారి లోన్ తీసుకునేవారికి లోన్ పొందే ప్రక్రియ సులభమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.