365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 8,2025:ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కులు, రహదారులు, చెరువులపై జరుగుతున్న అక్రమ కబ్జాల విషయంలో సామాన్యులు కూడా వెనుకడటం లేదు. “వారికి అర్థబలం ఉంది, రాజకీయ అండ ఉంది” అని భయపడకుండా నేరుగా ఫిర్యాదులు చేస్తున్నారు.
సోమవారం జరిగిన హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 36 ఫిర్యాదులు అందాయి. వీటిలో పార్కు స్థలాల అక్రమ వినియోగం, చెరువుల్లోకి మురుగునీరు చేరి ఇళ్లు ముంపునకు గురవడం, రహదారులపై అక్రమ నిర్మాణాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి.
హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఫిర్యాదులను పరిశీలించి, ఫిర్యాదుదారుల సమక్షంలోనే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజెస్‌తో పరిస్థితులను చూపించారు. అనంతరం సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ముఖ్యమైన ఫిర్యాదులు:
పటాన్‌చెరు – ఏపీఆర్ ప్రవీణ్ లగ్జారియాలోని పార్కు స్థలంలో రాత్రికి రాత్రే ఆలయం నిర్మిస్తున్నారని నివాసితులు తెలిపారు. ప్రశ్నిస్తే దాడికి దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కుత్బుల్లాపూర్ – గాజులరామారంలోని చిన్న బంధం చెరువును రెండు వైపులా కబ్జా చేస్తున్నారని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాపోయారు. చెరువుకు ఫెన్సింగ్ వేయాలని కోరారు.
ఇది కూడా చదవండి…BIGBOX ఇండియా 2025లో ‘సస్టైనబుల్ సప్లై చైన్ అవార్డు’ను అందుకున్న హెర్బాలైఫ్ ఇండియా..
రాజేంద్రనగర్ – బండ్లగూడ పీ అండ్ టీ కాలనీలో అర ఎకరం పార్కు స్థలాన్ని ఆక్రమిస్తున్నారని నివాసితులు తెలిపారు. గండిపేట మండలంలోనూ ప్రభుత్వ భూములపై కబ్జా జరుగుతోందని ఫిర్యాదులు అందాయి.
మాచబొల్లారం – ముతుకుల కుంట 4.62 ఎకరాల నుంచి 12 ఎకరాలకు పెరిగిపోయిందని, తూములు మూసివేయడం వల్ల లే ఔట్‌లు మునిగిపోతున్నాయని గ్రామస్థులు తెలిపారు.