365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,సెప్టెంబర్ 11,2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మరింత ప్రాతినిధ్యం లభించనుంది.
ఇది కూడా చదవండి…మైక్రోచిప్స్: భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తినిచ్చే సాంకేతిక వజ్రాలు..
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో పంచాయితీరాజ్, మున్సిపల్ చట్ట సవరణలకు కూడా గవర్నర్ ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

తాజా పరిణామాల నేపథ్యంలో రెండు లేదా మూడు రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం బీసీ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ నిర్ణయం ద్వారా బీసీలకు రాజకీయంగా మరింత అవకాశాలు లభిస్తాయని పలువురు పేర్కొంటున్నారు.