365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,సెప్టెంబరు 16,2025 : శేషాచల పర్వతాలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం, క్రీ.పూ. 12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో, 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో నిర్మితమైంది.

శ్రీవారి ఆలయానికి మొత్తం మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఆలయ గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివని శాసనాలు చెబుతున్నాయి. ఆలయంలో ఆభరణాలు, పవిత్ర వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం వంటి వాటిని భద్రపరచడానికి వేర్వేరు గదులు ఉన్నాయి. వీటితో పాటు లడ్డూ ప్రసాదం తయారీకి ప్రత్యేకమైన పోటు (వంటశాల), శ్రీవారి నైవేద్యం కోసం మరో వంటగది ఉన్నాయి.

శ్రీవారి ఆలయం అభివృద్ధికి అనేక రాజవంశాలు, రాజులు, రాణులు, సేనాధిపతులు, ఇంకా ఎందరో భక్తులు అపారమైన విరాళాలు సమర్పించారు. ఈ అద్భుతమైన నిర్మాణంలో పలు ఉప ఆలయాలు, మండపాలు ఉన్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయంలోని మండపాలను ఆనాటి చక్రవర్తులు, రాజులు అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యంతో నిర్మించారు. ఇందులో ముఖ్యమైనవి: మహాద్వారం, కృష్ణరాయమండపం, రంగనాయక మండపం, తిరుమలరాయ మండపం, అద్దాల మండపం – ఐనా మహల్, ధ్వజస్తంభ మండపం, కళ్యాణ మండపం, తిరుమామణి మండపం, స్నపన మండపం, రాములవారి మేడ, శయన మండపం, వసంత మండపం,కులశేఖరపడి.

ఈ మండపాల పైకప్పులు, స్తంభాలపై శ్రీ కృష్ణస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, వరాహస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి వంటి దేవతా మూర్తులు, లక్ష్మీదేవి వివిధ రూపాలు, జంతువులు, లతలు, పూలతో కూడిన శిల్పాలు ఉన్నాయి.

ఆలయంలోని ముఖ్య మండపాలు & నిర్మాణాలు

మహాద్వారం (ప్రధాన గోపురం): 13వ శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడి కుడి గోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గునపం వేలాడదీయబడి ఉంటుంది.

కృష్ణరాయమండపం: మహాద్వారానికి ఆనుకొని 16 స్తంభాలపై సింహంపై కూర్చొని ఉన్న వీరుల శిల్పాలతో నిర్మించిన మండపం ఇది. ఈ మండపంలో కుడివైపు తిరుమల దేవి, చిన్నాదేవిలతో శ్రీకృష్ణదేవరాయల రాగి ప్రతిమలు, ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయలు, విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణిల నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి.

రంగనాయక మండపం: శ్రీరంగనాథ యాదవ రాయలు క్రీ.శ. 1310-1320 మధ్య నిర్మించారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులను క్రీ.శ. 1320-1360 మధ్య ఈ మండపంలో భద్రపరచడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.

తిరుమలరాయ మండపం: దీనిని ఊంజల్ మండపం అని కూడా పిలుస్తారు. క్రీ.శ. 1473లో సాళువ నరసింహరాయలు వేదిక భాగాన్ని నిర్మించగా, క్రీ.శ. 16వ శతాబ్దంలో ఆరవీటి తిరుమలరాయలు సభాప్రాంగణాన్ని నిర్మించారు.

ఇక్కడ రాజా తోడరమల్, ఆయన తల్లి మాతా మోహనా దేవి, భార్య పిటా బీబీ లోహ విగ్రహాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణం రోజున శ్రీవారు ఈ మండపంలో పూజలందుకుంటారు.

అద్దాల మండపం – ఐనా మహల్: కృష్ణరాయ మండపానికి ఉత్తరం వైపు ఉన్న ఈ మండపం 36 స్తంభాలతో నిర్మించారు. ఇక్కడ ప్రతిరోజూ స్వామివారికి డోలోత్సవం నిర్వహిస్తారు.

ధ్వజస్తంభ మండపం: వెండి వాకిలిని తాకుతూ ఉండే ఈ మండపాన్ని క్రీ.శ. 1470లో సాళువ నరసింహరాయలు నిర్మించారు. ఇందులో బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. ప్రతి బ్రహ్మోత్సవంలో తొలిరోజు గరుడకేతనాన్ని ఇక్కడ ఎగురవేస్తారు.

వసంత మండపం: శ్రీవారి ఆలయానికి మహాప్రదక్షిణ మార్గంలో నైరుతి దిశలో ఈ మండపం ఉంది.

కళ్యాణ మండపం: శ్రీ అవసరం చెన్నప్ప క్రీ.శ. 1586లో నిర్మించిన ఈ మండపంలో ఒకప్పుడు శ్రీ మలయప్పస్వామి వారికి, శ్రీదేవి భూదేవిలకు కల్యాణోత్సవం నిర్వహించేవారు.

తిరుమామణి మండపం: బంగారు వాకిలికి, గరుడ సన్నిధికి మధ్య ఉన్న ఈ ప్రదేశం నుండే సుప్రభాత సేవలో భక్తులు పాల్గొంటారు.

స్నపన మండపం: బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లగానే ఉండే ఈ మండపాన్ని క్రీ.శ. 614లో పల్లవరాణి సామవై నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించారు.

రాములవారి మేడ: స్నపన మండపం దాటి కుడివైపు ఎత్తుగా కనిపించే ఈ ప్రదేశంలో రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలు ఉన్నాయి.

శయనమండపం: రాములవారి మేడ దాటి లోపలికి వెళ్తే ఉన్న గదే శయనమండపం. ఇక్కడ ప్రతిరోజూ ఏకాంత సేవలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి బంగారు పట్టె మంచంపై శయనిస్తారు.

కులశేఖరపడి: శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్య ఉన్న రాతి ద్వారబంధం. పడి అంటే మెట్టు లేదా గడప అని అర్థం.

గర్భాలయం (ఆనంద నిలయం): కులశేఖరపడి దాటితే శ్రీవారి గర్భాలయం ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఇక్కడ ఆవిర్భవించారు. ఈ ఆనంద నిలయంపై బంగారు గోపురం ఉంది, దీనినే ఆనంద నిలయ విమానం అంటారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు): గర్భాలయంలో స్వయంవ్యక్త మూర్తిగా ఉన్న దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. ఈయన నిలబడి ఉన్నందున స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్నందువల్ల ధ్రువమూర్తి లేదా ధ్రువబేరం అని కూడా అంటారు.