365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 24,2025: సింగపూర్‌లో స్కూబా డైవింగ్ సమయంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన భారతీయ లెజెండరీ గాయకుడు జుబీన్ గార్గ్ స్మారక సంతాప సభ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ నటి భైరవి అర్ద్య డేకా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

40కి పైగా భాషల్లో 38 వేలకు పైగా పాటలు పాడి, కోట్లాది అభిమానులను సంపాదించిన అసాధారణ ప్రతిభాశాలి జుబీన్ గార్గ్ ఆకస్మిక మరణం పట్ల భైరవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఆమె మాట్లాడుతూ.. “భారతీయ సినీ పరిశ్రమ ఒక అసమానమైన కళాకారుడిని కోల్పోయింది. ఇది సంగీత ప్రియులకు తీరని నష్టం. జుబీన్ గార్గ్ మన కాలంలోని గొప్ప గాయకుల్లో ఒకరు మాత్రమే కాదు, పేదలకు సహాయం చేసిన గొప్ప మానవతావాది. అస్సాంలో ఆయనను దైవంగా కొలుస్తారు,” అని అన్నారు.

జుబీన్ గార్గ్ వారసత్వాన్ని భావితరాలకు చేర్చేందుకు స్మారక ట్రస్ట్ స్థాపనకు భూమి కేటాయించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు భైరవి కృతజ్ఞతలు తెలిపారు.

గాయకుడిగా మాత్రమే కాకుండా, సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు, నటుడిగా జుబీన్ గార్గ్ భారతీయ సినిమాకు అమూల్యమైన కృషి చేశారు. తెలుగు సినిమాల్లో కూడా ఆయన తన గాత్రంతో మాయ చేశారు.

నితిన్ నటించిన టక్కరిలో ‘యేలే యేలే’, విక్టరీలో ‘ఓ బ్యాచిలర్’, రామ్ పోతినేని మస్కాలో ‘గుండె గోదారిలా’ వంటి పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ అవకాశాలను దివంగత సంగీత దర్శకుడు చక్రి అందించారు.

సెప్టెంబర్ 19న ఈశాన్య ఉత్సవంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్ళిన జుబీన్ గార్గ్, స్కూబా డైవింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స సమయంలో ఆయన కన్నుమూశారు. ఈ సంఘటన భారతీయ సినీ,సంగీత పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది.