365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సికింద్రాబాద్, నవంబరు 30,2025: ఖమ్మం జిల్లా మధిర నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమం వేగం పెంచుకుంది. తెలుగు రాష్ట్రాల ఐక్య కార్యాచరణ వేదిక ఇటీవల ఈ డిమాండ్‌ను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో వేదిక ప్రతినిధులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. బందరు పోర్టుతో అనుసంధానమయ్యే ఈ రైల్వే లైన్ వల్ల దిగుమతి–ఎగుమతుల్లో తెలంగాణకు గణనీయమైన లాభాలు చేకూరుతాయని, అలాగే ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు మెట్ట ప్రాంతాల అభివృద్ధికి ఇది కీలకంగా ఉపయోగపడుతుందని ఐక్యవేదిక నాయకుడు చాట్రాతి రామకృష్ణ తెలిపారు.
ఈ రైల్వే లైన్ అమలులోకి వస్తే విజయవాడ జంక్షన్‌పై ఉన్న ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని వివరిస్తూ, రాబోయే బడ్జెట్లో సర్వే కోసం నిధులు కేటాయించేలా తగిన చర్యలు తీసుకోవాలని రామచందర్ రావును ఆయన అభ్యర్థించారు.

రామచందర్ రావును కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో జీవీ చలపతిరావు, జి. అనిల్ కుమార్, సోమాసి శ్రీనివాస్, పాలడుగు కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
