365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 30, 2025: ఆకాశంలో నిర్భయంగా దూసుకుపోయే విమానాలకు సైతం సౌర వికిరణం (Solar Radiation) కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

ప్రపంచవ్యాప్తంగా వేలాది ఎయిర్‌బస్ ఏ320 (Airbus A320) విమానాలు ఈ ప్రభావానికి గురై, వాటి నియంత్రణ వ్యవస్థలకు సంబంధించిన కీలక డేటా దెబ్బతినే ప్రమాదం ఉందని తేలడంతో… విమానయాన రంగంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఏమిటీ సోలార్ రేడియేషన్(solar radiation)..?

మనందరికీ తెలుసు, సూర్యుడు శక్తికి మూలం. ఆ సూర్యుడి నుంచి అంతరిక్షంలోకి నిరంతరం శక్తిమంతమైన కణాలు మరియు విద్యుదయస్కాంత తరంగాలు ప్రవహిస్తుంటాయి. ఈ ప్రవాహాన్నే సౌర వికిరణం అంటారు.

సూర్యుడి కేంద్రంలో జరిగే అణు సంలీన (Nuclear Fusion) చర్యల వల్ల ఈ శక్తి ఉత్పత్తవుతుంది. ఈ వికిరణంలో అతినీలలోహిత (UV) కిరణాలు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు వంటి శక్తివంతమైన కణాలు ఉంటాయి.

ప్రమాదం ఎక్కడంటే..?

భూమిపై ఉన్నప్పుడు వాతావరణం మనల్ని రక్షిస్తుంది. కానీ, విమానాలు అత్యంత ఎత్తులో ప్రయాణించేటప్పుడు, ముఖ్యంగా అధిక సౌర జ్వాలలు (Solar Flares) లేదా సౌర కరోనా (Solar Corona) ప్రభావం ఉన్నప్పుడు, ఈ రేడియేషన్ ప్రభావం సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలపై పడుతుంది.

ఏ320 విమానాలపై తీవ్ర ప్రభావం..?

తాజాగా, ఎయిర్‌బస్ సంస్థకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన ఏ320 ఫ్యామిలీ విమానాల్లో ఈ సోలార్ రేడియేషన్ కారణంగా తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తే ప్రమాదం ఉందని గుర్తించారు. అసలు సమస్య ఎక్కడంటే…

కీలక వ్యవస్థ దెబ్బ..?

విమాన నియంత్రణ వ్యవస్థలో కీలకమైన ఎలివేటర్ అండ్‌ ఎలిరాన్ కంప్యూటర్‌ (ELAC) యూనిట్‌లో ఈ సమస్య తలెత్తింది.

డేటా చెరిగిపోవడం..?

తీవ్రమైన సౌర వికిరణం ప్రభావంతో ELAC యూనిట్‌లోని సంక్లిష్టమైన ‘ఫ్లైట్ కంట్రోల్ డేటా’ తాత్కాలికంగా లేదా పూర్తిగా చెరిగిపోయే ప్రమాదం ఉందని ఎయిర్‌బస్ గుర్తించింది.

నియంత్రణ కోల్పోయే ప్రమాదం: ఒకవేళ ఈ కీలక డేటా కోల్పోతే, విమానం తోక భాగాన్ని నియంత్రించే ‘ఎలివేటర్ల’కు ELAC తప్పుడు సిగ్నల్స్‌ను పంపి, గాల్లో విమానం నియంత్రణ కోల్పోయే ముప్పు ఉందని భద్రతా నిపుణులు హెచ్చరించారు.


ఇటీవల మెక్సికోలోని కాన్‌కన్‌ నుంచి న్యూయార్క్‌కు బయల్దేరిన ఓ జెట్‌బ్లూ ఏ320 విమానం అకస్మాత్తుగా ఎత్తును కోల్పోవడం, ప్రయాణికులు గాయపడటం వంటి ఘటనకు ఈ సోలార్ రేడియేషన్ ప్రభావమే కారణమని విచారణలో తేలింది.

ప్రపంచవ్యాప్తంగా సర్వీసులకు అంతరాయం..

సౌర వికిరణం సమస్యను గుర్తించిన వెంటనే, యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) సహా పలు అంతర్జాతీయ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 6,000 ఏ320 ఫ్యామిలీ విమానాలకు వెంటనే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేయాలని ఎయిర్‌బస్ అత్యవసర ప్రకటన విడుదల చేసింది.

భారత్‌పై ప్రభావం..

భారత్‌లో ఇండిగో, ఎయిర్‌ఇండియా వంటి విమానయాన సంస్థల వద్ద ఉన్న దాదాపు 200-250 ఏ320 విమానాలకు ఈ సాఫ్ట్‌వేర్ మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ అత్యవసర అప్‌గ్రేడ్ పనుల కారణంగా పలు విమానాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో, దేశవ్యాప్తంగా అనేక విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి లేదా రద్దయ్యాయి.

భద్రతే ప్రధానమని ప్రకటించిన ఎయిర్‌లైన్స్, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపాయి. ముందు జాగ్రత్త చర్యగా ఈ సాఫ్ట్‌వేర్ మార్పులను చేపడుతున్నప్పటికీ, భానుడి నుంచి వచ్చే శక్తే విమానాలకు ముప్పుగా మారుతుండటం… పౌరవిమానయాన రంగంలో చర్చనీయాంశంగా మారింది.