365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మిర్యాలగూడ, డిసెంబర్ 20,2025 : మిర్యాలగూడ పట్టణంలో కంటి వైద్యం పేరుతో సాగుతున్న నకిలీ వైద్య దందాను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) అధికారులు ఎట్టకేలకు బట్టబయలు చేశారు. అర్హత కలిగిన కంటి వైద్య నిపుణులు లేకుండానే ఆపరేషన్లు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పలు ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారులు ఉక్కుపాదం మోపారు.
‘మిషన్ మిర్యాలగూడ అగెనెస్ట్ క్వాకరీ’లో భాగంగా శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన టీజీఎంసీ బృందం ఎనిమిది కంటి వైద్య కేంద్రాలను పరిశీలించింది. అయితే ఒక్క ఆసుపత్రిలో కూడా అర్హత కలిగిన ఆఫ్తాల్మాలజిస్టు అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది.
పేరు డాక్టర్లది.. పని టెక్నీషియన్లది!
శ్రీ వెంకటేశ్వర కంటి ఆసుపత్రికి చెందిన డా. ఎం. భరత్ భూషన్, షాలిని కంటి ఆసుపత్రికి చెందిన డా. కె. వెంకటేశ్వర్లు కేవలం ఎంబీబీఎస్ మాత్రమే చదివి, ఎమ్మెస్ (ఆఫ్తాల్మాలజీ) చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అసలు కంటి వైద్యులు హైదరాబాద్ వంటి నగరాల్లో ఉంటూ, మిర్యాలగూడలో మాత్రం ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మాలజీ టెక్నీషియన్ల ద్వారానే ఆసుపత్రులు నడుపుతున్నట్లు తేలింది. అర్హత లేని ఈ సిబ్బందే మందులు రాయడం, పరీక్షలు చేయడం, చివరికి కంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.
ఆర్ఎంపీలు అడ్డంగా దొరికారు..

కోమల మెడికల్ అండ్ జనరల్ స్టోర్ నిర్వాహకుడు ఎ. కోటేశ్వర్ రావు ఎటువంటి వైద్య అర్హతలు లేకుండానే బెడ్లు ఏర్పాటు చేసి యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తూ పట్టుబడ్డారు. ఫ్రెండ్స్ క్లినిక్ నిర్వాహకుడు మునీర్ అనే ఆర్ఎంపీ తనిఖీల విషయం తెలిసి పరారయ్యాడు.
లైసెన్సులు సస్పెండ్ చేస్తాం: టీజీఎంసీ
టీజీఎంసీ సభ్యుడు డా. వి. నరేష్ కుమార్ మాట్లాడుతూ, “నకిలీ కంటి వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. సరైన వివరణ ఇవ్వకపోతే వారి ఎంబీబీఎస్ లైసెన్సులను సస్పెండ్ చేస్తాం. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. అర్హతకు మించి వైద్యం చేసిన టెక్నీషియన్లు, నకిలీ వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగానికి సిఫార్సు చేశారు.
