365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 15,2026: భారతీయ హిందూ సంస్కృతిలో పండుగలంటే కేవలం వేడుకలే కాదు.. అవి ప్రకృతితో మానవుడికి ఉన్న విడదీయరాని బంధానికి ప్రతీకలు. చెట్లు చేమలు,మంచు తెరల మాటున మెల్లగా వీచే చలి గాలుల మధ్య, పల్లె ముంగిళ్లు రంగవల్లులతో మెరిసిపోతుంటే.. ‘నేనున్నాను’ అంటూ భాస్కరుడు ఉత్తర దిశగా అడుగులు వేసే పవిత్ర పర్వదినమే మకర సంక్రాంతి.

ఉత్తరాయణ పుణ్యకాలం..

సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. ఈ రోజు నుంచే దేవతలకు పగలు అని చెప్పబడే అత్యంత పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. భీష్మ పితామహుడు తన ప్రాణ త్యాగం కోసం ఈ కాలం కోసమే ఎదురుచూడటం దీని విశిష్టతను చాటిచెబుతోంది.

ముగ్గురు మూర్తుల కలయిక..మూడు రోజుల వేడుక..

భోగి.. పాతను వదిలి కొత్తను ఆహ్వానించే పర్వదినం. భోగి మంటల సెగలు అజ్ఞానాన్ని దహించి, జ్ఞాన కాంతిని నింపుతాయి. చిన్నారులకు భోగి పళ్లు పోయడం ద్వారా దిష్టి తొలగి, ఆయురారోగ్యాలు చేకూరుతాయని నమ్మకం.

ఇదీ చదవండి..సంక్రాంతి సందడి: బస్ బుకింగ్‌లలో 65% పెరుగుదల.. ఏపీ, తెలంగాణ టాప్.. !

సంక్రాంతి.. ఇది పంటల పండుగ. రైతన్న శ్రమ ఫలితం ఇంటికి చేరిన వేళ. గొబ్బెమ్మల నడుమ హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు పల్లెల్లో అలౌకికానందాన్ని పంచుతాయి. నువ్వులు-బెల్లం కలిపి పంచుకోవడం స్నేహానికి, సద్భావానికి సంకేతం.

కనుమ.. మనతో పాటు శ్రమించిన పశువులను పూజించే రోజు. ప్రకృతిలోని ప్రతి జీవికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలనే ఉన్నతమైన సందేశం ఈ కనుమ పండుగలో దాగి ఉంది.

ఆరోగ్యమే మహాభాగ్యం..

సంక్రాంతి కేవలం ఆధ్యాత్మికమే కాదు, శాస్త్రీయమైనది కూడా. ఈ కాలంలో కొత్త బియ్యం, నువ్వులు, బెల్లం, వేరుశనగలు కలిపి తినడం వల్ల చలికాలంలో శరీరానికి అవసరమైన వేడి, పోషకాలు లభిస్తాయి. పొంగలి నైవేద్యం సూర్యుడికి సమర్పించడం వెనుక కృతజ్ఞతా భావం ఉట్టిపడుతుంది.

ఇదీ చదవండి..కోయంబత్తూరులో ELGi సరికొత్త వాక్యూమ్ పంప్ తయారీ కేంద్రం ప్రారంభం..

Read this also..ELGi Equipments Launches Advanced Vacuum Pump Assembly Line in Coimbatore..


సంక్రాంతి అంటే ‘మారడం’ అని అర్థం. ప్రకృతిలో వచ్చే మార్పుతో పాటు, మనలోని దుర్గుణాలను విడనాడి.. సద్గుణాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఈ పండుగ అసలైన పరమార్థం.