365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,జనవరి 25, 2026: ఏడు కొండలవాడు ఏడు వాహనాలపై ఊరేగుతూ.. భక్తకోటిని పునీతం చేసిన అద్భుత ఘట్టం తిరుమల గిరులపై ఆవిష్కృతమైంది. మాఘ శుద్ధ సప్తమిని పురస్కరించుకుని ఆదివారం తిరుమల క్షేత్రంలో ‘రథసప్తమి’ పర్వదినాన్ని టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది.
Read this also..Volkswagen India Begins Local Assembly of Premium Tayron R-Line SUV..
Read this also..Suzuki Matsuri: India’s Flagship Biking Festival Set to Rev Up Hyderabad..
సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు సాగిన ఈ వాహన సేవలతో తిరుగిరులు గోవింద నామస్మరణతో మారుమోగాయి.
ఆరోగ్యప్రదాత.. సూర్యప్రభ వాహన సేవ..
పర్వదినం వేళ ఉదయం 5.30 గంటలకు ఉదయార్క కిరణాల సాక్షిగా శ్రీమలయప్ప స్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యమండల మధ్యవర్తిగా, సకల రోగ నివారణిగా భాసించే సూర్యనారాయణ మూర్తి రూపంలో స్వామి వారు వెలిగిపోయారు.
ఉత్తర మాడ వీధిలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకిన అద్భుత దృశ్యాన్ని వేలాది మంది భక్తులు దర్శించి తరించారు.
మురిపించిన బాలల శ్లోక పారాయణం..
ఈ వేడుకలో శ్రీవేంకటేశ్వర బాలమందిరం విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సూర్యప్రభ వాహనం మాడ వీధుల్లోకి రాగానే, విద్యార్థులు లయబద్ధంగా ఆలపించిన ‘ఆదిత్య హృదయం’, ‘సూర్యాష్టకం’ శ్లోకాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు చేసిన ఈ పారాయణం వేడుకకు ఆధ్యాత్మిక శోభను అద్దింది.
ఒకరోజు బ్రహ్మోత్సవం.. అనంత ఫలం..
రథసప్తమిని తిరుమలలో ‘ఒకరోజు బ్రహ్మోత్సవం’గా పిలుస్తారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై విహరించిన స్వామి వారు, రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించనున్నారు. క్రీ.శ 1564 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు శాసనాలు చెబుతున్నాయి.

ప్రముఖుల దర్శనం.. సౌకర్యాల పర్యవేక్షణ..
ఈ వైభోగాన్ని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి తదితరులు దర్శించుకున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం తదితర అధికారులు గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, నీరు, భద్రతా సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
