365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 7,2026: నగరంలోని చెరువుల పరిరక్షణ, అభివృద్ధి కోసం హైడ్రా (HYDRAA) తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. శనివారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు నిర్వహించిన ‘ఫోన్-ఇన్’ కార్యక్రమంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా పాల్గొని నగరవాసుల ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బాధితులు తమ ప్రాంతాల్లోని చెరువులు గుర్రపుడెక్కతో నిండిపోయి, మురుగు నీరు చేరడం వల్ల దోమల ఉధృతి పెరుగుతోందని వాపోయారు. దుర్వాసనతో కిటికీలు కూడా తీయలేని పరిస్థితులు ఉన్నాయని, చెరువులను తక్షణమే అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన కమిషనర్, ఇప్పటికే మొదటి విడతలో 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే మరో 14 చెరువులను ఆధునీకరించనున్నట్లు ప్రకటించారు. నగరంలోని చెరువులన్నింటినీ దశలవారీగా పునరుద్ధరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి..ఓలా, ఉబెర్‌ల ఆధిపత్యానికి చెక్..’భారత్‌ టాక్సీ’క్యాబ్‌ సేవలు..

ఇదీ చదవండి..‘లింగ నిర్ధారణ’ శస్త్రచికిత్స ఎలా చేస్తారు..?

ఆక్రమణలపై ఫిర్యాదుల వెల్లువ
చెరువులే కాకుండా ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయి:

దుండిగల్: గాగిలాపూర్‌లో రోడ్లను ఆక్రమించి ప్లాట్లుగా మారుస్తున్నట్లు ఫిర్యాదు.

ప్రగతి నగర్: పార్కు స్థలంలో అనధికారిక నిర్మాణాలు.

ఇదీ చదవండి..తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం..

Read this also:SBI Hits Record Performance: Q3 Net Profit Climbs 13% to Rs.21,317 Crore..

మాధాపూర్: సున్నం చెరువు వద్ద వంద అడుగుల రోడ్డును వాటర్ ట్యాంకర్లు ఆక్రమించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు.

అత్తాపూర్: 33 గుంటల ప్రభుత్వ భూమి, పార్కు స్థలాల కబ్జా యత్నాలు.

జిల్లాల నుంచి వచ్చిన ఆక్రమణల ఫిర్యాదులపై స్పందిస్తూ, హైడ్రా పరిధి ప్రస్తుతం ఓఆర్ఆర్ (ORR) వరకు మాత్రమే పరిమితమై ఉందని కమిషనర్ స్పష్టం చేశారు.

హైడ్రా కార్యాలయానికి రాలేని వారి కోసం ప్రతి సోమవారం జరిగే ‘ప్రజావాణి’కి అదనంగా, ఇకపై ప్రతి శనివారం ఫోన్-ఇన్ కార్యక్రమం కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు.

సెలవు దినాలు మినహా, శనివారాల్లో 040-29565750, 040-29565759 నంబర్లకు ఫోన్ చేసి సమస్యలను వివరించవచ్చని సూచించారు. ఫిర్యాదు చేసిన వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాకుంటే నేరుగా తనకు ఫోన్ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 36 మంది ఫిర్యాదుదారులతో కమిషనర్ నేరుగా మాట్లాడి పరిష్కార మార్గాలను సూచించారు.