365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి18, 2023: టీడీపీనేత, టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తారకరత్న ఈరోజు బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కుప్పంలో నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటు రావడంతో, నటుడు స్థానిక ఆసుపత్రిలో చేరారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. 23 రోజుల చికిత్స తర్వాత, నటుడు శనివారం సాయంత్రం చనిపోయారు. ఈ వార్త తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నందమూరి తారకరత్న ఒక్కడో నంబర్ కుర్రాడు సినిమాతో తెరంగేట్రం చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత భదాద్రి రాముడు, అమరావతి, నందీశ్వరుడు, మనమంతా, ఎదురు లేని అలెగ్జాండర్, రాజా చెయ్యి వేస్తే వంటి పలు చిత్రాల్లో నటించారు.
అమరావతి చిత్రానికి గాను తారకరత్న ఉత్తమ విలన్ విభాగంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు.
తారకరత్న 9 అవర్స్ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. నందమూరి నటుడు చివరిసారిగా తెరపై కనిపించిన చిత్రం S5- నో ఎగ్జిట్. తారకరత్నకు భార్య, ఒక బిడ్డ ఉన్నారు. తారకరత్న పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు అందుకోసమే ఇటీవల టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
తారకరత్న మరణ వార్త విని తాను చాలా బాధపడ్డానని, అతని కుటుంబానికి తన హృదయపూర్వక సానుభూతి తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
తారక రత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి మోకిల లోని తన నివాసానికి తరలిస్తారు. ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు.