Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 28,2023:దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం రోజువారీ గరిష్ఠాల్లోనే ముగిశాయి. ఉదయం నుంచి రేంజు బౌండ్లోనే కదలాడిన సూచీలకు మధ్యాహ్నం మూమెంటమ్ లభించింది.

అదానీ గ్రూప్ షేర్లు ఏకంగా రూ.1,31,907 కోట్ల మేర సంపద పోగేయడమే ఇందుకు కారణం. దీనికి తోడుగా ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మెటల్, ఎనర్జీ రంగాలూ ఊపు తీసుకొచ్చాయి.

ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,900 దాటేస్తే మార్కెట్లో మూమెంటమ్ పెరిగేందుకు ఆస్కారం ఉంది. విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.783 కోట్ల కొనుగోళ్లతో నెట్ బయర్స్‌గా అవతరించారు. దేశీయ సంస్థాగత ఇన్వె్స్టర్లూ రూ.1324 కోట్ల విలువైన షేర్లను కొనడం గమనార్హం. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.38 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 65,970 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 66,063 వద్ద మొదలైంది. ఐరోపా మార్కెట్లు మొదలయ్యే వరకు రేంజుబౌండ్లోనే కొనసాగింది. 65,906 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.

కొనుగోళ్ల మద్దతుతో 66,256 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 204 పాయింట్ల లాభంతో 66,174 వద్ద ముగిసింది. మంగళవారం 19,844 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,800 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.

19,916 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. ఆఖరికి 95 పాయింట్ల లాభంతో 19,889 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ 111 పాయింట్లు ఎగిసి 43,880 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 39 కంపెనీలు లాభపడగా 11 నష్టపోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. సిప్లా, అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ యునీలివర్, సన్ ఫార్మా, ఐటీసీ షేర్లు టాప్ లాసర్స్.

నేడు నిఫ్టీ ఫార్మా, హెల్త్ కేర్, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కళకళలాడాయి.

నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ ఛార్ట్ గమనిస్తే 19,960 వద్ద రెసిస్టెన్సీ, 19,850 వద్ద సపోర్టు ఉన్నాయి. ఇన్వెస్టర్లు నియర్ టర్మ్‌లో అంబుజా సిమెంట్స్, ఫినోలెక్స్ కేబుల్స్, గో ఫ్యాషన్, కజారియా సిరామిక్స్ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

నిఫ్టీ పెరుగుదల్లో అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్, ఎయిర్ టెల్ కీలక పాత్ర పోషించాయి.

పెట్రోనెట్ ఎల్ఎన్‌జీలో 35 లక్షల షేర్లు చేతులుమారాయి. రాబోయే నాలుగేళ్లలో అమ్మకాలు, ఎబిటా, ప్రాఫిట్‌ను రెట్టింపు చేసుకోవాలని టాటా పవర్ భావిస్తోంది. యునైటెడ్ బ్రూవరీస్ హీనెకెన్ సిల్వర్ డ్రాట్ బీర్‌ను ఆవిష్కరించింది.

హిండెన్‌బర్గ్ ఉదంతం తర్వాత అదానీ గ్రూప్ షేర్లు తొలిసారి ఒక్కరోజులోనే రూ.1.31 లక్షల కోట్ల సంపదను పోగేశాయి. సీజీ పవర్‌లో 11.3 లక్షల షేర్లు చేతులు మారాయి.

పదేళ్ల మౌలిక బాండ్ల ద్వారా రూ.5000 కోట్లు సేకరించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ణయించుకుంది. రూ.3,445 వద్ద టైటాన్ షేర్లు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. 2024 జనవరి నుంచి ధరలు పెంచుతారన్న అంచనాలతో టాటా మోటార్స్ షేర్లు జీవిత కాల గరిష్ఠాన్ని అందుకున్నాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709

error: Content is protected !!