365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,మార్చి18,2023: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధి లోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల కాలేజ్ డే వేడుకలు ఈ రోజు ఉల్లాసంగా ,ఉత్సాహంగా జరిగాయి. రాజేంద్రనగర్ లోని వర్సిటీ ఆడిటోరియంలో విద్యార్థులు అత్యంత సందడిగా ఈ వేడుకలను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఐఎఫ్ఎస్ అధికారి త్రినాథ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తాను ఈ కళాశాల నుంచే గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నానని , వ్యవసాయ కోర్సులు చదివే అవకాశం రావడం చాలా అదృష్టం అని అభిప్రాయపడ్డారు.
ప్రతి మనిషి జననం నుంచి మరణం వరకూ అనుక్షణమూ ఆహారంపైననే ఆధారపడిఉంటుందని కాబట్టి అటువంటి వృత్తిలో ఉండడం గర్వంగా భావించాలని త్రినాథ్ కుమార్ పేర్కొన్నారు.
విద్యార్థి జీవితంలో ఇటువంటి కాలేజీ డేలు తీపి గుర్తులుగా మిగిలిపోతాయని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.సుధీర్ కుమార్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలలో దేశం మంచి పురోగతి సాధించిందని ఆయన తెలిపారు.
నేడు వ్యవసాయ రంగం అనేక కొత్త సవాళ్ళు ఎదుర్కొంటున్నదని, సహజ వనరులను పరిరక్షిస్తూనే పెరుగుతున్న జనాభా అవసరాలకి అనుగుణంగా ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచాల్సిన అవసరముందని సుధీర్ కుమార్ తెలిపారు. అదే విధంగా డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన టెక్నాలజీలని వ్యవసాయంలో విరివి గా ఉపయోగించాలన్నారు.
ORDER NOW 🍝🍜🍲🍛🍣🍤🦈👈
ఐకార్ సూచనలకి అనుగుణంగా ప్రతి ఏటా సీట్లని కూడా పెంచుతున్నట్లు సుధీర్ కుమార్ వివరించారు. తదనంతరం సాంకృతిక, క్రీడా, వ్యాస రచన తదితర పొటీలలోప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందచేసారు.
ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు చేసిన కళా ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకొన్నాయి. ఈ కార్యక్రమంలో వర్సిటీ పీజీస్టడీస్ డీన్ డాక్టర్ అనిత, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సీమ, రాజేంద్రనగర్ కళాశాల అసొసియేట్ డీన్ నరేంద్ర రెడ్డి, కళాశాల విద్యార్థి వ్యవహారాల ఇన్ ఛార్జ్ రవీంద్ర నాయక్, ఫాకల్టీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ పోటీలలో క్రీడల బాలుర విభాగం, బాలికల విభాగం, సాంస్కృతిక పోటీలలో బీఎస్సీ మూడవ సంవత్సరం విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారు.
అదే విధంగా అథ్లెటిక్స్ ఇండివిడ్యువల్ ఛాంపియన్ షిప్ ని బాలుర విభాగంలో మూడవ సంవత్సరం విద్యార్థి ప్రిన్స్ రాజ్, బాలికల విబాగంలో మూడవ సంవత్సరం విద్యార్థిని మేఘన కైవసం చేసుకుంది.
నాలుగవ సంవత్సరం విద్యార్థి వెంకట్ క్రికెట్ మాన్ ఆఫ్ ది సిరీస్ సాధించాడు. క్రీడలు, ఆటల నిర్వహణని యూనివర్సిటీ పరిశీలకులు డాక్టర్ బి.విద్యా సాగర్, సాంస్కృతిక కళల పోటీలను డాక్టర్.ఎస్. త్రివేణి, సాహితీ కళల పోటీలని డాక్టర్ అజీజుద్దీన్ మహ్మద్, సృజనాత్మక కళల పోటీలని డాక్టర్ బి.ఈశ్వరి పర్యవేక్షించారు.