365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 3,2025 : తెలంగాణ ఆర్థికాభివృద్ధి వ్యూహంలో స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలు, తొలి తరం పారిశ్రామికవేత్తలను కేంద్రంగా చేస్తూ అఖిల భారత ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ) ఎంఎస్ఎంఈ వింగ్ గురువారం కీలకమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది.
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలను) బలోపేతం చేసే లక్ష్యంతో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఏఐపీసీ నాయకులు తెలిపారు.

ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా.. ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య రెడ్డి, శశాంక్ పసుపులేటి, అబ్దుల్లా బాక్రాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత 2047కు అనుగుణంగా తమ కార్యక్రమాలను రూపొందించినట్లు వివరించారు.
స్వయం సమృద్ధి సాధించిన తెలంగాణ నిర్మాణంలో ఎంఎస్ఎంఈలే వెన్నెముకగా నిలబడతాయని ఏఐపీసీ స్పష్టం చేసింది.
ప్రధాన లక్ష్యాలు ఏమిటి..?
మద్దతు: మహిళా పారిశ్రామికవేత్తలు, యువ స్టార్టప్‌లు, స్థానిక వ్యాపార వర్గాలకు పూర్తి మద్దతు అందించడం.మెంటరింగ్, నిబంధనల అమలులో సహాయం, మార్కెట్ మార్గదర్శకత్వం కల్పించడం.
ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, ప్రభుత్వ మద్దతుగల ఆర్థిక పథకాలు, సంస్థాగత రుణాలను పొందే విషయంలో సహాయపడటం.
“బలమైన ఎంఎస్ఎంఈ వ్యవస్థే ఉద్యోగ కల్పన, పారిశ్రామిక వృద్ధికి పునాది” అని ఏఐపీసీ నాయకులు నొక్కి చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ఆలోచన దశ నుంచి వ్యాపార విస్తరణ వరకు ఒక పటిష్టమైన సహాయక వ్యవస్థగా తాము పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, సంస్థల సృష్టిపై ప్రధానంగా దృష్టి సారించడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక స్థితిస్థాపకతను నిర్మిస్తామని ఏఐపీసీ పేర్కొంది.
ఈ చొరవ ద్వారా, ఏఐపీసీ విధాన రూపకల్పన (పాలసీ)కు, క్షేత్ర స్థాయి పారిశ్రామికవేత్తలకు మధ్య వారధిగా నిలబడి, వ్యాపార ఆశయాలను స్థిరమైన సంస్థలుగా మార్చడానికి కృషి చేస్తామని తెలిపారు.
