ఆకాశగంగ, జాపాలిలో అలరించిన ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మే 27,2022: హనుమజ్జయం తి ఉత్సవాల్లో చివరిరోజైన మే 29వ తేదీ ఆదివారం తిరుమల ధర్మగిరి వేదపాఠశాల లో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు 18 గంటల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2,808 శ్లోకాలను పండితులు పారాయణం చేస్తారు. హనుమంతుడు విశ్రాంతి లేకుండా రామకార్యం కోసం వెళ్లిన విధంగా పండితులు నిరంతరాయంగా సంపూర్ణ సుందరకాండను పారాయణం చేస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
కాగా, హనుమజ్జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆకాశగంగ, జపాలి తీర్థంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు అలరించాయి. ఉదయం ఆకాశగంగలోని శ్రీ అంజనాదేవి, శ్రీ ఆంజనేయస్వామివారికి నిర్వహించిన స్నపనతిరుమంజనం కార్యక్రమంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. నాదనీరాజనం వేదికపై సాయంత్రం 4 గంటలకు “వీరో హనుమాన్ కపిః” అనే అంశంపై డా.ఆకెళ్ల విభీషణశర్మ ఉపన్యసించారు.
ఆకాశగంగలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు జాతీయ సంస్కృత విశ్వవిద్యా లయం సహాయ ఆచార్యులు డా. తనూజ విష్ణువర్ధన్ శ్రీ హనుమ అవతార ఘట్టంపై ఉపన్యసించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నమాచా ర్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి కవిత, శ్రీమతి లావణ్య, శ్రీ ఉదయభాస్కర్ బృందం శ్రీ హనుమాన్ చాలీసా, శ్రీరామ, శ్రీ హనుమ సంకీర్తనలు ఆలపించారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ ఎల్.జయరామ్ పలు భక్తి సంకీర్తనలను భావయుక్తంగా గానం చేశారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు శ్రీమతి పి.స్రవంతి హరికథ వినిపించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు భజన బృందం కళాకారులు హనుమంతుని వైభవంపై సంకీర్తనలు గానం చేశారు. ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ పురుషోత్తం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
జపాలి శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉదయం 10 నుంచి 11 గంటల వరకు భజన బృందం కళాకారులు హనుమంతుని వైభవంపై సంకీర్తనలు గానం చేశారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు శ్రీ వై.వేంకటేశ్వర్లు హరికథ వినిపించారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి కవిత, శ్రీమతి లావణ్య బృందం, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు ఎల్.జయరామ్ బృందం పలు భక్తి సంకీర్తనలు ఆలపించారు.