365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,ఏప్రిల్ 9,2022: లోక కల్యాణం కోసం తిరుమల నాద నీరాజనం వేదికపై శనివారం సాయంత్రం టిటిడి చేపట్టిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం భక్తిభావాన్ని పంచింది. జనవరి 14వ తేదీ ప్రారంభమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం శనివారంతో ముగిసింది. పలువురు భక్తులు నేరుగా పాల్గొనగా, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది భక్తులు తమ ఇళ్లలోనే పారాయణం చేశారు. వేదిక మీద చిన్న శేష వాహనంపై శ్రీ మలయప్పస్వామివారిని కొలువు దీర్చి మంగళహారతి సమర్పించారు.
ఈ సందర్భంగా శ్రీ కుప్పా నరసింహ శర్మ మాట్లాడుతూ కలియుగంలో భగవన్నామస్మరణ ముక్తికి మార్గమని శ్రీ నారదమహర్షి లోకానికి తెలిపారన్నారు. విష్ణుసహస్రనామంలోని వెయ్యినామాలు వేదాల నుండి ఉద్భవించాయన్నారు. మహర్షులు ఉపదేశించిన ఈ పారాయణం వలన గ్రహ దోషాలు తోలగి సుఖ శాంతులతో జీవిస్తారని, స్తోత్ర వైశిష్ట్యాన్ని వివరించారు.
ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్ శ్లోకాలు, పూర్వపీఠిక శ్లోకాలు పారాయణం చేశారు. అనంతరం విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకాలను, ఉత్తర పీఠికలోని శ్లోకాలను పారాయణం చేశారు.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థలోని సుమారు 200 మంది వేదపండితులు, విశేష సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు