365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, చెన్నై,ఆగస్టు 25, 2024: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో తొలి రోజు నిరాశ పరిచిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టు రెండో రోజు సత్తా చాటింది. ఈ ఫెస్టివల్‌లో భాగంగా చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఆదివారం జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్) మొదటి రౌండ్ రెండో రేసులో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ డ్రైవర్ అఖిల్ రవీంద్ర రెండో స్థానంతో రన్నరప్‌గా నిలిచాడు.
భారతీయ రేసర్ అయిన అఖిల్ అగ్రస్థానంలో పోటాపోటీగా తలపడ్డాడు. చివరకు 27 నిమిషాల 115.266 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన శ్రాచి రాద్ బెంగాల్ టైగర్స్ డ్రైవర్, మలేసియాకు చెందిన అలీస్టర్ యూంగ్ 27 నిమిషాల 15.266 సెకన్లలో అందరికంటే ముందుగా రేసును పూర్తి చేసి విజేతగా నిలిచాడు.
గోవా ఏసెస్ జేఏ రేసింగ్ జట్టు మహిళా డ్రైవర్ గాబ్రియెల్లా జిల్కోవా (చెక్ రిపబ్లిక్) 27 నిమిషాల 35.127 సెకన్లతో మూడో స్థానం సొంతం చేసుకుంది. ఫార్ములా –4 ఇండియన్ పోటీ మొదటి రౌండ్‌లో గాడ్‌స్పీడ్ కొచ్చి రేసర్, ఆస్ట్రేలియాకు చెందిన 19 ఏళ్ల హ్యూ బార్టర్ విజేతగా నిలిచాడు. ఈ పోటీ రెండో రేసును 27 నిమిషాల 06.573 సెకన్లతో మొదటి స్థానంతో పూర్తి చేసిన బార్టర్… మూడో రేసును కూడా (27 ని. 06.536 సె) అగ్రస్థానంతో ముగించాడు.