365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6,2025 :మద్యం, పెట్రోల్ వంటి వాటిని ప్రస్తుతానికి జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల ఆదాయానికి ఇవే ప్రధాన వనరులు కావడంతో వాటిని రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇది సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రాలకు ఆదాయ వనరుగా మద్యంపై పన్ను..

ఇది కూడా చదవండి…స్విగ్గీ, జొమాటో కంపెనీలకు జీఎస్టీ దెబ్బ..!

టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ విషయంపై స్పందించారు. ఇటీవలి జీఎస్టీ రేట్ల సవరణలో 12%, 28% స్లాబ్‌లను రద్దు చేసి 5%, 18% అనే రెండు పన్ను రేట్లను మాత్రమే ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే, పాన్‌ మసాలా, పొగాకు, కార్లు, విమానాలు, పడవలు వంటి విలాసవంతమైన వస్తువులపై 40% పన్ను కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే, మద్యం మాత్రం దీని పరిధిలోకి రాదని ఆమె తెలిపారు. మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రాష్ట్రాలకు గణనీయమైన ఆదాయం వస్తున్నందున, దానిని రాష్ట్రాల నియంత్రణలోనే ఉంచాలని గత ప్రభుత్వాలు కూడా నిర్ణయించాయి.

ఆన్ లైన్ గేమింగ్ తో దేశానికి, యువతకు నష్టం..

ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ వల్ల దేశం, యువత నష్టపోతున్నారని మంత్రి నిర్మల అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సవరించిన పన్నుల విధానంలో అధిక లాభాలు పొందుతున్న వ్యాపార సంస్థలను తనిఖీ చేయడానికి ప్రత్యేక యంత్రాంగం లేదని ఆమె అన్నారు. భవిష్యత్ లో చేపట్టే జీఎస్టీ సంస్కరణలతో భారత్ మరింత పారదర్శక ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తుందని ఆమె చెప్పారు.