365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 1, 2025 : H-1B అండ్ L-1 వీసా నియమాలను కఠినతరం చేయడానికి అమెరికాలో సన్నాహాలు ముమ్మరమయ్యాయి. అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా, వీసా నియమాలలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ముగ్గురు యూఎస్‌ సెనెటర్లు రెండు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టారు.

ఈ మార్పులు ప్రధానంగా ఈ వీసాలపై ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ కంపెనీలపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నారు.

వీసా మార్పుల వెనుక కారణం..?

చౌకైన విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇస్తూ, అనేక మంది యజమానులు H-1B అండ్ L-1 వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని సెనేటర్ చక్ గ్రాస్లీ (రిపబ్లికన్), సెనేటర్ డిక్ డర్బిన్ (డెమొక్రాట్) ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద కంపెనీలు వేలాది మంది అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూ, తక్కువ వేతనాలతో విదేశీ కార్మికుల కోసం వీసా దరఖాస్తులు దాఖలు చేస్తున్నాయని డర్బిన్ వివరించారు.

ప్రధాన బిల్లులో మార్పులు (గ్రాస్లీ-డర్బిన్)..

గ్రాస్లీ , డర్బిన్ ప్రవేశపెట్టిన బిల్లు కింది అంశాలపై దృష్టి సారిస్తుంది. కనీస వేతనాలు, నియామక ప్రమాణాలు పెంచడం.అమెరికన్ ఉద్యోగుల నియామకాలను తప్పనిసరి చేయడం. వీసా అర్హతను మరింత కఠినతరం చేయడం.

H-1B లాటరీకి చెల్లు! జీతం ఆధారిత ఎంపికకు ప్రాధాన్యం..

H-1B వీసాలకు సంబంధించి మరో కీలక ప్రతిపాదన అమలు కానుంది. ప్రస్తుతమున్న లాటరీ వ్యవస్థను పూర్తిగా తొలగించి, జీతం ఆధారిత ఎంపిక ప్రక్రియను అమలు చేయాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం, అత్యధిక జీతాలు ($162,528) సంపాదించే కార్మికులకు నాలుగు ‘లాటరీ టిక్కెట్లు’ కేటాయించి, వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

భారతదేశానికి ఆందోళనకరం ఎందుకంటే..?

యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం, H-1B వీసాలలో ఏకంగా 71 శాతం భారతీయులకు మంజూరు అవుతున్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి అగ్రశ్రేణి భారతీయ ఐటీ కంపెనీలు ఈ వ్యవస్థపై భారీగా ఆధారపడి ఉన్నాయి.

కొత్త నిబంధనలు ఈ కంపెనీలకు బిలియన్ల కొద్దీ నష్టాలకు దారితీసి, ఉద్యోగాలను భారతదేశానికి తరలించే పరిస్థితిని లేదా నియామకాలను తగ్గించే పరిస్థితిని సృష్టించవచ్చు.