365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పాలకొల్లు,సెప్టెంబర్ 7, 2025 : ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

పాలకొల్లులో జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.

నంది నాటకోత్సవాలు, అవార్డులు..

నవంబర్ నెలలో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంది అవార్డులను త్వరలోనే ప్రకటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నీటి వనరుల శాఖను “నోటి వనరుల శాఖ”గా మార్చారని విమర్శించారు.

కళాకారులకు ప్రోత్సాహం..

ప్రతిభావంతులైన కళాకారులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. లఘు చిత్రాల పోటీలను ఒక మంచి ప్రక్రియగా అభివర్ణించిన ఆయన, సామాజిక దృక్పథంతో తీసిన చిత్రాలను ప్రశంసించారు.

తెలుగు భాషాభిమానిగా జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ పేరును అభినందించారు. రాజమహేంద్రవరం కళలకు కాణాచి అని, అక్కడి కళారూపాలను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి తరలిరావాలి..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావాల్సిన ఆవశ్యకతను, సినిమా పరిశ్రమ పరిణామక్రమాన్ని మంత్రి వివరించారు. తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చే ఆదాయంలో 60 శాతం ఏపీ నుండే వస్తుందని, ఎక్కువ శాతం షూటింగ్‌లు ఇక్కడే జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాలన్న హరిరామ జోగయ్య ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

పద్యనాటకానికి చావు లేదు..

పద్యనాటకానికి, నాటకానికి చావు లేదని మంత్రి ఘంటాపథంగా ఉద్ఘాటించారు. కురుక్షేత్ర నాటకం మాదిరి పద్యనాటకాలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందన్నారు.

పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు..

తాను మంత్రిగా ఉండటానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణే అని మంత్రి దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, వీరశంకర్, విఎన్ ఆదిత్య, సినీ గేయ రచయిత సిరాశ్రీ, ముఖ్య సమన్వయకర్త రాజా వన్నెంరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ కేసిరాజు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.