365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి, జూన్ 4,2022 : అమ రావతిలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు రేపటి నుంచి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. అందులో భాగంగా శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ హించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా శోభాయాత్ర జరిగింది. ఆ తరువాత పుణ్యాహవచనం, ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలు చేపట్టారు.
రేపు ఉదయం పుణ్యాహవచనం, పంచగవ్యాధివాసం చేపడతారు. సాయంత్రం హోమాలు నిర్వహిస్తారు. జూన్ 6న ఉదయం నవ కలశ స్నపన క్షీరాధివాసం, సాయంత్రం హోమాలు, యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు. జూన్ 7న ఉదయం చతుర్ధశ కలశ స్నపన జలాధివాసం, సాయంత్రం యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 8న ఉదయం 10.45 నుంచి 11.30 గంటల వరకు విమాన కలశ స్థాపన, గోపుర కలశ స్థాపన, విగ్రహ స్థాపన, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం చేపడతారు. సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, రాత్రి యాగశాల కార్యక్రమాలు చేపడతారు.
జూన్ 9న ఉదయం మహాపూర్ణాహుతి, విమాన గోపుర కలశ ఆవాహన, ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు మిథున లగ్నంలో ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు శాంతి కల్యాణోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలో టిటిడి వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు, డెప్యూటీ ఈవో గుణభూషణ్‌రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయసారథి, ఎఈవో దొరస్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.