365తెలుగు డాట్ కామ్ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 2022 జనవరి 20: ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ తిరుచానూరు ఆలయంలో శుక్రవారం నుండి ఏడు రోజుల పాటు జరుగనున్న శ్రీయాగానికి గురువారం రాత్రి వేడుకగా అంకురార్పణ జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో అర్చకులు శ్రీ వేంపల్లి .శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఏకాంతంగా ఈ యాగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆచార్య రుత్విక్ వరణం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి 21న మొదటిరోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యాగశాల హోమాలు, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహామంగళహారతి చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. జనవరి 22 నుండి 26వ తేదీ వరకు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీయాగం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జనవరి 27న చివరిరోజు ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు చతుష్టానార్చన, హోమాలు, మహాప్రాయశ్చిత్త హోమం, మహాశాంతి హోమం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు మహాపూర్ణాహుతి చేపడతారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు అభిషేకం మరియు అవభృతం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, జెఈవో వీరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి అర్చకులుబాబు స్వామి పాల్గొన్నారు.
ఆర్జిత సేవలు రద్దు
శ్రీయాగం కారణంగా జనవరి 20 నుండి 27వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టిటిడి రద్దు చేసింది. జనవరి 20, 21, 27వ తేదీల్లో బ్రేక్ దర్శనం రద్దు చేయడమైనది.