365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 19,2024: హైందవులకు సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం. వైదిక కాలంలో సూర్యారాధనకు అత్యధిక ప్రాధాన్యం ఉండేది. కానీ కాలక్రమేణా, సూర్యునికి ప్రత్యేకమైన దేవాలయాల సంఖ్య తగ్గిపోయింది. అలాంటి అతి కొద్ది సూర్య దేవాలయాలలో రెండు ప్రాచీన ఆలయాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. వీటిలో అరసవల్లి గురించి అందరికీ తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి గ్రామంలో ఉన్న ఈ దేవాలయం సుమారు 1500 సంవత్సరాలుగా భక్తుల పూజలందుకుంటోంది.
అరసవల్లి ఆలయాన్ని దర్శించుకున్న భక్తుల కష్టాలు తొలగిపోతాయి, అందుకే ఈ ఊరికి హర్షవల్లి అని పేరు ఉండేది, ఇది కాలక్రమేణా అరసవల్లిగా మారింది. తెలుగు ప్రజలకు తెలియని మరో పురాతన సూర్య ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడలో ఉంది. కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లల మామిడాడలో ఈ ఆలయం ఉంది.
ఈ గ్రామం వద్ద తుల్యభాగా నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందనే నమ్మకం ఉంది. ఊరిలో అడుగుపెడు తూనే గోపురాలు కనిపిస్తాయి, అందుకే ఈ ఊరిని గోపురాల మామిడాడ అని పిలుస్తారు. గొల్లల మామిడాడలోని సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రాచీనమైనది. మామిడాడ క్షేత్రంలో రెండు భారీ గోపురాలు ఉన్నాయి.
మొదటి గాలి గోపురం 1950వ సంవత్సరంలో నిర్మితమైంది, 9 అంతస్తులతో 160 అడుగుల ఎత్తులో ఉంటుంది. రెండవ గాలి గోపురం 1958వ సంవత్సరంలో 13 అంతస్తులతో 200 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ గోపురాల కింద నుంచి పైకి చేరేందుకు మెట్లు ఉన్నాయి. గోపురం పైకి చేరిన తరువాత 25 కిలోమీటర్ల దూరం వరకు ప్రకృతి సోయగాలను వీక్షించవచ్చు.
గోపురాలపై ఉన్న శిల్పాలు రామాయణ, మహాభారత కథా వృత్తాంతాలను అద్భుతంగా ప్రతిబింబిస్తాయి, వాటిని చూస్తూ ఉన్నప్పుడు మనసు ఆ కాలంలోకి తీసుకెళ్తుంది. 1902లో కొవ్వూరి బసివిరెడ్డి అనే జమీందారు భక్తి, శ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిరాటంకంగా ఈ ఆలయంలో పూజలు నిర్వహించబడుతున్నాయి.
ముఖ్యంగా ఆదివారాల్లో ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు ఎంతో వైభవంగా ఉంటాయి. రథసప్తమి వంటి పర్వదినాలలో స్వామివారికి జరిగే కళ్యాణంలో వేలాది భక్తులు పాల్గొంటారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, సూర్య భగవానుడు ఉష, ఛాయ దేవేరులతో కలిసి సతీసమేతంగా దర్శనమిస్తారు.
ఆలయానికి ఎలా చేరుకోవాలంటే..?
మామిడాడ గ్రామం కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 58 కిలోమీటర్ల దూరంలో, సామర్లకోటకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట వరకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి బస్సులు, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.