365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,అక్టోబరు 12,2021: తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆలయం బయట ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎస్వీబిసి కన్నడ, హిందీ భాషల్లో ఛానళ్లను మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి సమక్షంలో మంగళవారం ఉదయం ప్రారంభించారు.
శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంతోపాటు హిందూ ధర్మ ప్రచారం కోసం అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి గారి ఆదేశంతో టిటిడి ప్రతిష్టాత్మకంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఏర్పాటు చేసిన విషయం విదితమే. 2008, జులై 7వ తేదీన అప్పటి టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి గారి అధ్యక్షతన, భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ గారి చేతులమీదుగా ఎస్వీబీసీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నిత్య, పక్ష, మాస సేవలు, బ్రహ్మోత్సవాలు లాంటి ఎన్నో కార్యక్రమాలను గత 13 సంవత్సరాలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పిస్తోంది. శ్రీవారి సేవలతోపాటు సనాతన హిందూ ధర్మాన్ని, సనాతన సంప్రదాయాన్ని తెలియజేస్తూ ఎన్నో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రసారం చేస్తూ భక్తుల మన్ననలు పొందుతోంది.
శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వచ్చే తమిళ భక్తుల కోరిక మేరకు 2017వ సంవత్సరంలో తమిళ ఉగాది రోజున ఎస్వీబీసీ తమిళ ఛానల్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా ఛానళ్లను ప్రారంభించి శ్రీవారి భక్తులు ఆ భాషల్లో కూడా స్వామివారి సేవలను వీక్షించే అవకాశం కల్పించడమైనది. దేశవిదేశాల్లో ఉన్న హిందీ మరియు కన్నడ భక్తులు శ్రీవారి సేవల ప్రసారాలు వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు.