365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, ఫిబ్రవరి 3, 2022: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల”ఛలో విజయవాడ”కార్యక్రమం నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వేర్వేరు చోట్ల మాట్లాడారు. ఉద్యోగులకు మేలు చేయడానికే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్న వారు, ఈ విషయాన్ని ఉద్యోగులు అర్ధం చేసుకుని చర్చలకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల మేలుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. కరోనా సమయంలో ఆందోళనలు సరి కాదు,మంత్రుల కమిటీ చర్చలకు ఎప్పుడూ సిద్ధమే, ఉద్యోగులూ ప్రభుత్వంలో ఒక ముఖ్య భాగం.. కొత్త వేతనాల ప్రాసెస్ తర్వాత ఆపమనడం సరికాదు. అందుకు ఉద్యోగులంతా ఆలోచించాలి. ఆందోళన, సమ్మె ప్రతిపాదనలు విరమించాలని
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల విజ్ఞప్తి చేశారు.
బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి:
ఉద్యోగులకు ఏమన్నా సమస్యలుంటే వాటిపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొదటి నుండి చర్చలకు ప్రభుత్వమే సానుకూలంగా ఉంది. మేము మొండివైఖరితో ఉన్నామని ఉద్యోగులు విమర్శించడం సరి కాదు. కొత్త జీతాలు ప్రాసెస్ చేశాక జీతాలు అపమని చెప్పడం భావ్యం కాదు. నిజానికి ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం, పోలీస్‌లు పూర్తి సంయమనంగా వ్యవహరించారు. ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నారా లోకేష్ నాన్న ఆనాడు ఉద్యోగులను ఏం ఉద్ధరించారు? ఒక్కసారి గుర్తు చేసుకొండి.
కె.నారాయణస్వామి, డిప్యూటీ సీఎం:
ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులు. ఉద్యోగులు చర్చలకు రావాలని మంత్రుల కమిటీ కోరుతోంది. సీఎం వైయస్ జగన్ ఉద్యోగులందరిని కుటుంబం సభ్యులుగా భావిస్తున్నారు. ఉద్యోగులు మంత్రుల కమిటీతో చర్చలు జరపాలి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఉద్యోగులకు మేలు చేశారా? ఇప్పుడు సీఎం వైయస్ జగన్, నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే, పప్పు బెల్లాలు పంచుతున్నారంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు.
మేకతోటి సుచరిత,హోం మంత్రి:
చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్దం. ఉద్యోగులు సహకరించాలని సీఎంగారు కూడా చెప్పారు. వారితో చర్చల కోసం మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఎక్కడా హౌస్ అరెస్టులు లేవు. అయితే అనుమతి లేని సభలకు వెళ్ళవద్దని చెప్పాం.
బాలినేని శ్రీనివాసరెడ్డి, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి:
చర్చల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు ఉద్యోగులు ముందుకు వస్తే అన్నీ పరిష్కారం అవుతాయి. విద్యుత్ రంగంలో అప్పులు ఉన్నా ఆ సంస్థల ఉద్యోగులకు నాలుగు డిఏలు ఇచ్చాం. ప్రస్తుత పరిస్ధితులకు అనుకూలంగానూ, అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేస్తుంది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది.
కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి:
ఉద్యోగులు పిఆర్సీని ఒక సమస్యగా భావిస్తున్నారు. వారి సందేహనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందువల్ల ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ వద్దకు ఉద్యోగులు చర్చలకు రావాలని కోరుతున్నాను. అంతేకానీ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే సమస్య పరిష్కారం కాదనేది నా అభిప్రాయం. కావాలనే కొందరు రెచ్చగొట్టే ధోరణితో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఉద్యోగులకు స్నేహపూర్వకంగా ఉండే నాయకుడు సీఎం వైయస్ జగన్. 2018 లో చంద్రబాబు పీఆర్సీ వేసి అమలు చేయకపోయినా.. అధికారంలో వచ్చిన వెంటనే ఐఆర్ ఇచ్చిన ఘన చరిత్ర సీఎంగారిది. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు సీఎంగారిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి:
ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయి. అందువల్ల చర్చలకు రండి. ఉద్యోగులకు మేలు చేసే ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. మీరంతా మా కుటుంబ సభ్యులు. ఎవరికీ అన్యాయం జరగదు. 2008, 2018 నాటి డీఎస్సీలలో వచ్చిన సమస్యలు పరిష్కరించి టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చింది మన సీఎం. ఉద్యోగులకు మంచి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ సమస్య ఉన్నా మంత్రుల కమిటీ ముందు చర్చించండి. ఉద్యోగ సంఘాలకు సీఎం వైయస్ జగన్ అత్యంత గౌరవం ఇస్తారు.
పి. విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి:
ఉద్యోగులు సహనం పాటిస్తే బాగుంటుంది. పట్టుదలకు పోవద్దు. ప్రభుత్వం అన్ని వర్గాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. రెండేళ్లుగా కరోనాతో అన్ని వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పెడితే ప్రభుత్వమే ఉద్యోగులకు మరింతగా మేలు చేస్తుంది. ఉద్యోగులంతా మా (ప్రభుత్వ) కుటుంబ సభ్యులే.
అవంతి శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి:
ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలున్నాయని భావిస్తే, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందువల్ల వారు సమ్మెలు నిరసన కార్యక్రమాలు చేపట్టడంలో అర్థం లేదు. ఉద్యోగుల పక్షపాతి సీఎం వైఎస్ జగన్. ఉద్యోగులంటే సీఎంగారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను నానా బాధలకు గురి చేసిన చంద్రబాబు ఇపుడు వారి పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు.
జోగి రమేష్, పెడన ఎమ్మెల్యే:
ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. వారికి ఎక్కడా అన్యాయం జరగనివ్వదు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే, పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడమే సరైన చర్య కాదు. ఒమిక్రాన్ ఉన్న సమయంలో ఇలా చేస్తే కోవిడ్ సంక్రమించే అవకాశం ఉంది. నిజానికి సీఎం వైయస్ జగన్, అడగకుండానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చారు.
మల్లాది విష్ణు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే:
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యం. వారితో చర్చించడానికి ప్రభుత్వం ఎపుడూ సిద్దంగానే ఉంది. ఉద్యోగుల పట్ల సీఎం వైయస్ జగన్ చాలా సానుకూలంగా ఉన్నారు. గతంలో చంద్రబాబు ఉద్యోగులపై ఏ విధంగా వ్యవహరించారో చూశాం. ఉద్యోగులు చర్చలకు ముందుకు రాకుండా, బల ప్రదర్శనకు దిగడం సరికాదు. కోవిడ్ కారణంగానే ఛలో విజయవాడ కార్యక్రమం వద్దన్నాం. ఉద్యోగులు ఇప్పటికైనా పరిస్థితులను అర్థం చేసుకోవాలి. సమ్మె ప్రతిపాదన విరమించాలి.