ambati-rambabu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి,నవంబర్ 25,2022: ఈనాడు రామోజీరావుపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే… గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా చిట్‌ ఫండ్‌ కంపెనీలలో సోదాలు జరుగుతున్నాయి. ఆ సోదాల్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వారందరిపై చట్టప్రకారం కేసులు పెట్టి శిక్షించే కార్యక్రమం జరుగుతోంది. ఇందులో ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ ఫండ్‌ కంపెనీ కూడా చట్టాన్ని ఉల్లంఘించిన అంశాలు తేటతెల్లంగా కన్పిస్తున్నాయి.

చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు ఎంతటివారైనా సరే వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. దీనినిబట్టి, పత్రికారంగంలో మీడియా కింగ్‌గా పేరుపొందిన రామోజీరావు నడిపే సంస్థలన్నీ చట్టవ్యతిరేకంగానే ఏర్పడ్డాయని స్పష్టమవుతోంది. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి హయాంలో మార్గదర్శి ఉల్లంఘనలపై పెట్టిన కేసుల దగ్గర నుంచి సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ పోరాటం చేస్తున్నారు.

ambati-rambabu

చిట్ ఫండ్ వ్యాపారానికి సంబంధించి అనేక చట్టాలను ఉల్లంఘించి రామోజీరావు విచ్చలవిడిగా ప్రవర్తించారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు బెంగుళూరు, చెన్నై లలో కూడా అనేక శాఖోప శాఖలు ఏర్పడ్డాయి. వ్యాపారం చేయవచ్చుగానీ, అది చట్టబద్దంగానే చేయాలి. ఇటీవల జరిగిన సోదాల్లో చట్టవ్యతిరేకంగా వ్యాపారం చేస్తున్నాడని, చిట్‌ఫండ్‌ యాక్టును రామోజీరావు దుర్వినియోగం చేస్తున్నాడనేది తేటతెల్లమయ్యింది” . అని అన్నారు.

మార్గదర్శి నుంచి వేల కోట్ల నిధులు ఇతర సంస్థలకు..


చిట్స్ వేసే సభ్యుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా ప్రత్యేకమైన అకౌంట్లో జమ చేయాలి. ప్రతి చిట్‌కి ఒక ప్రత్యేకమైన అకౌంట్‌ ఓపెన్‌ చేయాలి. కానీ మార్గదర్శి చిట్‌ ఫండ్‌ వారు అన్నిటికీ కలిపి ఒకే అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. సరైన ష్యూరిటీలు చూపలేదని, చిట్‌ పాడుకున్న తర్వాత ఇవ్వాల్సిన అమౌంట్‌ ను సైతం చిట్ సభ్యులకు సక్రమంగా ఇవ్వడం లేదు.

ambati-rambabu

ఆ డబ్బంతా మార్గదర్శి యాజమాన్యమే కొన్ని నెలల పాటు తమ దగ్గరే పెట్టుకోవడం వల్ల రిజర్వ్‌ ఫండ్స్‌ ఏర్పడుతున్నాయి. దాంతో వేల కోట్ల రూపాయలు రిజర్వ్‌ ఫండ్‌ను వారికున్న ఇతర సంస్థలకు డైవర్ట్‌ చేస్తున్నారు. రామోజీకే చెందిన, ఈనాడు, ఈటీవీ, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, ఉషోదయ పబ్లికేషన్స్, కళాంజలి, డాల్ఫిన్ హోటల్స్, కలోరమా ప్రింటర్స్, రామోజీ ఫౌండేషన్, ప్రియా ఫుడ్స్‌, ప్రియా పచ్చళ్ళు.. ఇలా అనేకమైన సంస్థలకు ఆ నిధులు మళ్ళించి, ఆ రిజర్వ్‌ ఫండ్‌ను వాటిల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు.

పైసా పెట్టుబడి లేకుండానే రామోజీరావు చిట్ దారుల డబ్బును ఉపయోగించి ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. కొన్ని దశాబ్ధాలుగా ఇలా చట్టవిరుద్ధంగానే ఆయన వ్యాపారం చేస్తున్నారు. ఎవరైనా చిట్ దారులు ప్రశ్నిస్తే.. మాపై కక్ష సాధింపు చర్య అంటూ పత్రిక ఉంది కదా అని వారి పత్రికల్లోనే దుమ్మెత్తిపోస్తున్నాడు రామోజీ. అన్యాయమైన, అక్రమమైన పద్ధతుల్లో చిట్‌ దారులను అన్యాయం చేస్తున్నారు. ఎవరైనా ఈ దేశంలో చట్టానికి అనుకూలంగానే నడుచుకోవాలే తప్ప వ్యతిరేకంగా ప్రవర్తించడానికి వీళ్లేదు. ప్రభుత్వాలు వీళ్ళ తప్పులను చూస్తూ ఊరుకోవడం కూడా సరైన విధానం కాదు. అందుకే మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

రామోజీరావు ఒక వైట్‌ కాలర్‌ క్రిమినల్‌..

ambati-rambabu


“రామోజీ ఒక ఆర్ధిక నేరగాడు కాబట్టే.. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగాడు. ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఏర్పాటు చేసిన సామ్రాజ్యం రామోజీది. 31.03.2022 నాటి మార్గదర్శి చిట్‌ ఫండ్‌ వారి బ్యాలెన్స్‌ షీట్‌ చూస్తే.. కంపెనీ షేర్‌ క్యాపిటల్‌ రూ. 2 కోట్లు మాత్రమే ఉంటే, రిజర్వ్‌ఫండ్‌ మాత్రం రూ. 1697 కోట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.768 కోట్లు. ఆ బ్యాలెన్స్‌ షీట్లో ప్రైజ్‌ మనీ చెల్లించింది మాత్రం రూ. 580 కోట్లు మాత్రమే” అని అంబటి రాంబాబు అన్నారు.

“అయితే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టింది రూ. 450 కోట్లు. దీనినిబట్టి, మార్గదర్శి బ్యాలెన్స్‌ షీట్లోనే ఫండ్స్‌ డైవర్ట్‌ చేసిన అంశం స్పష్టంగా కనిపిస్తోంది. అలా డైవర్ట్‌ చేయడం చట్ట విరుద్ధం. అంతేకాదు బ్యాలెన్స్‌ షీట్లో ఎంత వచ్చింది.. ఎంత వెళ్లింది అనేది మాత్రం చూపించడం లేదు. పైగా సోదాలకు వెళ్లిన అధికారులకు సహకరించడంలేదు. తనకు మీడియా ఉంది కదా.. వచ్చిన అధికారుల ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తున్నారు. ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కాదన్న విషయాన్ని ఈనాడు రామోజీ గుర్తించాలని” మంత్రి అంబటి పేర్కొన్నారు.