365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విశాఖపట్నం,అక్టోబర్14, 2022: ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా విశాఖ రాజధానిని సాధించి తీరుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను తెలియజెప్పేందుకు మన విశాఖ.. మన రాజధాని పేరుతో జేఏసీ ఏర్పాటు చేశారని చెప్పారు.
విశాఖను రాజధానిగా చేసుకునేoదుకు ఆదివారం నిర్వహించనున్న విశాఖ గర్జనకు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఉత్తరాంధ్ర ఇప్పటికీ పూర్తి వెనుకబాటుతనంతో ఉందని అన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మన భవిష్యత్ తరాలు బాగుపడవని ఆయన అన్నారు.
రేపు మొదలవుతున్న పోరాటం కేవలం ఉత్తరాంధ్రకే కాదు, ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా అని అమర్నాథ్ అన్నారు. కేంద్రీకరణ వల్ల జరిగిన నష్టం పునరావృతం కాకూడదని దీనివలన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన అన్నారు. దండయాత్ర చేస్తున్న రైతులకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని.. ఎందుకంటే, తాము పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఇప్పటివరకు ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న వారిపై పోరాటం చేయడానికి ఉత్తరాంధ్ర ప్రజలను ప్రేరేపించింది అమరావతి రైతులేనని ఆయన అన్నారు.
విశాఖ గర్జనకు వేలాదిగా తరలి వస్తున్న జనం అహింసా మార్గంలో వారి ఆకాంక్షలను పాదయాత్ర చేస్తున్న రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా ప్రాంత అభివృద్ధి కోసం జరుగుతున్న ఉద్యమాన్ని పత్రికల్లోనూ, మీడియాలోనూ రాకపోయినా పర్వాలేదు కానీ, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను హేళన చేస్తూ చూపించవద్దని మంత్రి అమర్నాథ్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని, పోరాటాన్ని దెబ్బ తీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విశాఖ నగరం ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చిందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఇక్కడ పుట్టి పెరిగిన వారు రోడ్డెక్కి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. రాయలసీమ ప్రాంత నాయకులు కూడా విశాఖ ఉద్యమానికి మద్దతు తెలియజేయడం గర్జనకు మరింత ఊపునిచ్చింది అని ఆయన అన్నారు.
జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ మాట్లాడుతూ విశాఖ రాజధానిగా ఏర్పడడానికి ఎవరు అడ్డు పెట్టొద్దని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నుండి బయటపడటానికి ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటున్న ఈ సమయంలో ఈ అవకాశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు.
1956లో విశాఖపట్నాన్ని శాశ్వత రాజధానిగా చేయాలని నిర్ణయించినా, రాజకీయ పెద్దల మద్దతు లేకపోవడం వల్ల అది కలగానే మిగిలిపోయిందని అన్నారు. మరోసారి విశాఖ రాజధాని కావడానికి అవకాశం వచ్చిందని దీన్ని మిగిలిన ప్రాంతాల వారు కూడా సహకరించాలని లజపతిరాయ్ విజ్ఞప్తి చేశారు.
విశాఖ గర్జన ఉత్తరాంధ్ర ప్రజల గుండెచప్పుడు అని అడ్డుకుంటే తాట తీస్తా మని ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. జేఏసీ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్త స్పందన లభిస్తోందని అన్నారు. విశాఖను రాజధానిగా చేస్తే విశాఖనగరం ఒక్కటే అభివృద్ధి చెందదని, వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.