365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వనపర్తి, నవంబర్ 20,2022: వనపర్తి జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ లాలూ ప్రసాద్ నియమితుల య్యారు. ఇందుకు సంంధించిన ఉత్తర్వులు శనివారం జారీ అయ్యాయి. డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డి.
హెచ్ భాగం రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ స్వగ్రామం పాలమూరు జిల్లా.తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభుత్వ వైద్యుల సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రభుత్వ వైద్యులను ఏకతాటిపై నిలిపి కృషి చేశారు.
వివిధ రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘాల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ చొరువ తీసుకొని వివిధ సమస్యల సాధనకు తీవ్ర కృషి చేశారు. తెలంగాణ ప్రభుత్వ సంఘంలోని ఇతర నాయకులతో కలిసి ప్రభుత్వ వైద్యుల డిమాండ్ల సాధనలో పాలుపంచుకున్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాషా ను కలిసిన లాలూ ప్రసాద్ రాథోడ్ శనివారం విధుల్లో చేరారు. అనంతరం పాలమూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ఎంబిబిఎస్ చదివే సమయంలో ప్రస్తుత వ్యవసా య శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తోడ్పాటు ఇచ్చారని,ఉద్యమ సమయంలో సేవలకు గుర్తింపుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అవకాశం వరిచిందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు .
ఈ సందర్భంగా డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు , రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.
వనపర్తి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ దీన్ దయాల్,రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రశాంత్ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు.