365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, అక్టోబరు 18,2023: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 19న గురువారం నాడు జరగనున్న గరుడ సేవకు విశేషంగా విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ శాస్త్రి మాట్లాడుతూ గరుడ సేవ దర్శనం కోసం బుధవారం రాత్రి నుంచి గ్యాలరీల్లో భక్తులు వేచి ఉంటారని వీరికి వేడిగా పాలు అందిస్తామని తెలిపారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు.
ఉదయం 5 గంటలకు కాఫీ, పాలు, ఉదయం 6.30 నుంచి 10 గంటల వరకు ఉప్మా లేదా పొంగలి, ఉదయం 11 నుంచి 1 గంట వరకు 2.75 లక్షల మందికి మజ్జిగ, మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకు 14 రకాల కూరగాయలతో బిసిబేలా బాత్, చక్కెర పొంగలి అందిస్తామన్నారు.
అదేవిధంగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు పులిహోర ప్యాకెట్లు, సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు సుండలు, పాలు, కాఫీ అందజేస్తామని తెలిపారు.
12 వాహనాలు, 150 ట్రాలీలు, 363 మంది అదనపు సిబ్బంది, 830 మంది శ్రీవారి సేవకులతో గ్యాలరీల్లో భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తామన్నారు.
అదే విధంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు వెంగమాంబ అన్న ప్రసాదం భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తామన్నారు.