365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, మార్చి 26,2022: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాలు, ఏప్రిల్ 15న జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేయాల‌ని టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం అధికారుల‌ను ఆదేశించారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై శ‌నివారం తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ క‌ల్యాణం రోజున వ‌చ్చే వేలాది మంది భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అన్న‌ప్ర‌సాదం, తాగునీరు, మ‌జ్జిగ అందించేందుకు చ‌క్క‌టి ఏర్పాట్లు చేయాల‌న్నారు. అన్ని విభాగాలు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించుకుని క‌ల్యాణం రోజున భ‌క్తుల‌కు అందాల్సిన సౌక‌ర్యాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని కోరారు. ఎండ వేడిమి నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పించేందుకు భ‌క్తులు న‌డిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేయాల‌ని, అవ‌స‌ర‌మైన చోట్ల చ‌లువపందిళ్లు ఏర్పాటు చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. ఊరేగింపు నిర్వ‌హించే వాహ‌నాలు, ర‌థానికి సంబంధించిన ప‌టిష్ట‌త‌ను ప‌రిశీలించి ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ తీసుకోవాల‌న్నారు.

అత్య‌వ‌స‌ర వైద్య ప‌రిస్థితుల్లో వెంట‌నే స్పందించేందుకు వీలుగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాల‌ని, ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేసి త‌గిన‌న్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాల‌ని సిఎంవోకు జెఈవో సూచించారు. సాంస్కృతిక‌, సంగీత కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక త్వ‌రిత‌గ‌తిన సిద్ధం చేయాల‌న్నారు. క‌ల్యాణం రోజున రాజంపేట‌, క‌డ‌ప‌, చిట్వేల్‌, బ‌ద్వేలు త‌దిత‌ర ప్రాంతాల నుండి భ‌క్తుల‌కు ర‌వాణా వ‌స‌తి క‌ల్పించేందుకు ఆర్‌టిసి అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు పూర్తి స‌న్న‌ద్ధంగా ఉండి వైఎస్ఆర్ జిల్లాలోని ఆయా విభాగాల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు.