Thu. Nov 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 16,2023: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన పండుగ బోనాల ఉత్సవాలు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

ఆదివారం ఆషాడ బోనాల సందర్బంగా ఓల్డ్ సిటీ లోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారు, లాల్ దర్వాజ సింహవాహిని, అక్కన్న మాదన్న, సబ్జిమండి, మీరాలం మండి తదితర ఆలయాలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలను సమర్పించారు.

మీరాలం మండి లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయా ఆలయాల వద్ద వేద పండితులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజల అనంతరం తీర్ధప్రసాదాలు అందజేసి శాలువా, పూలమాలలతో సత్కరించారు. అదేవిధంగా ఓల్డ్ సిటీ లోని ఉప్పుగూడ మహంకాళి ఆలయం, భరతమాత, హరి బౌలి, బంగారు మైసమ్మ, నాంపల్లిలోని ఏడు గుళ్ళు, గౌలిగూడ లోని మహంకాళి దేవాలయం, కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ ఇంకా పలు ఆలయాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రి వెంట దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ ఉన్నారు. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర పండుగగా ప్రకటించారని, నాటి నుంచి ప్రతి ఏటా బోనాల ఉత్సవాలకు ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని చెప్పారు.

బోనాల ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ప్రభుత్వం బోనాల ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు.

పండుగలు, ఉత్సవాలు ఐక్యతను చాటి చెప్పుతాయని, ప్రజలు సంతోషంగా పండుగలను జరుపుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన అన్నారు.

ఈ కార్యక్రమంలో బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ బాస్కర్ రాజ్, మాజీ అద్యక్షులు గాజుల అంజయ్య, రాకేశ్ తివారి, మధుసూదన్ గౌడ్, మధు యాదవ్, మాజీ కార్పొరేటర్ మమతా గుప్తా, బీఆర్ ఎస్ నాయకులు ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!