365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, ఆగస్టు 18,2025:అమీర్‌పేట మెట్రో స్టేషన్, మైత్రివనం వద్ద వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, హైడ్రా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ సోమవారం మైత్రివనం పరిసరాల్లోని వరదకాలువలను పరిశీలించారు. అనంతరం కృష్ణాకాంత్ పార్క్‌లోని చెరువు,వరద ప్రవాహ మార్గాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

చెరువుకు వరద మళ్లింపు ఆలోచన
జూబ్లీహిల్స్, వెంకటగిరి, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ నుంచి వచ్చే వరద నీటిని కృష్ణాకాంత్ పార్క్ చెరువుకు మళ్లిస్తే, అమీర్‌పేట వద్ద వరద ఉధృతిని నియంత్రించవచ్చని కమిషనర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును 12 ఎకరాలకు విస్తరించే అవకాశం ఉంది. దీని ద్వారా 120 మిలియన్ లీటర్ల నీటిని తాత్కాలికంగా నిల్వ చేసి, వర్షం తగ్గిన తర్వాత విడిచిపెట్టే అవకాశం ఉంటుందని అధికారులు సూచించారు.

ప్రస్తుతం చెరువులోకి నీరు ప్రవేశించకపోవడంతో, వరద నేరుగా మధురానగర్ మీదుగా అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద చేరి నీటిముగ్గులోకి దారి తీస్తోందని అధికారులు తెలిపారు. అదనంగా పై నుంచి వచ్చే చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా వరద ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నాయి.

ఇది కూడా చదవండి…దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి అల్పపీడన ప్రమాదం: భారీ వర్షాలకు అవకాశం..

జీపీఆర్‌ఎస్ సర్వే ఆవశ్యకత
అమీర్‌పేట–సంజీవరెడ్డినగర్ రహదారిని దాటే పైప్‌లైన్లలోని అడ్డంకులను గుర్తించడానికి జీపీఆర్‌ఎస్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే) నిర్వహించాలని కమిషనర్ సూచించారు. ఈ సర్వేతో పైపుల్లో పేరుకుపోయిన పూడికను గుర్తించి తొలగించే అవకాశం ఉంటుంది. అది సాధ్యం కాకపోతే, బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించవచ్చని చెప్పారు.

సారథి స్టూడియో నుంచి మధురానగర్ మీదుగా వచ్చే వరద కాలువలు రహదారి దాటే సమయంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిస్తే, అమీర్‌పేట వరద సమస్యకు ఉపశమనం లభిస్తుందని అధికారులు తెలిపారు. తక్షణ ఉపశమన చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని హైడ్రా కమిషనర్ అధికారులకు ఆదేశించారు.