365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 24,2022: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరగనున్నాయి. బల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అక్టోబర్ 2వతేదీన(ఆదివారం)రోజున బతుకమ్మ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ అన్నపూర్ణ తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారని ఆమె వెల్లడించారు.
బల్కంపేట ఆలయ రాజగోపురం వద్ద గల రేకుల షెడ్డులో సుమారు 3వేల మంది మహిళలు పాల్గొననున్నారని అన్నపూర్ణ చెప్పారు. అక్టోబర్ 2వతేదీ సాయంత్రం 5గంటలకు అత్యంత శోభాయమానంగా బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయని, ఆసక్తిగల మహిళలు ఆలయానికి విచ్ఛేసి అమ్మవారిని దర్శించి ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని దాతల సహకారముతో సమ కూర్చిన శేషవస్త్రము పసుపు, కుంకుమ, ప్రసాదాలను మంత్రి తలసాని చేతుల మీదుగా అందించనున్నారని సహాయ కమిషనర్, బల్కంపేట ఆలయ కార్య నిర్వహణాధికారిణి ఎస్.అన్నపూర్ణ పేర్కొన్నారు.