365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 18,2025:అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట ప్రాంగణం శుక్రవారం పండుగ వాతావరణాన్ని తలపించింది. వివిధ పాఠశాలల చిన్నారులు మానవహారంగా చెరువు చుట్టూ నిలబడి, ప్లకార్డులతో హైడ్రా (HYDRA)కు కృతజ్ఞతలు తెలిపారు. చెత్తతో నిండిన చెరువును తిరిగి ప్రకృతి అందాలతో మలిచిన విధానాన్ని పొగడ్తలతో చుట్టేశారు.
“హైడ్రా భవిష్యత్తుకు ఆదారం”, “చెరువులను కాపాడండి – పర్యావరణాన్ని పరిరక్షించండి” వంటి సందేశాలతో చిన్నారులు చైతన్యాన్ని నింపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు చెరువుల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.
బతుకమ్మ కుంట – మోడల్ ప్రాజెక్ట్: హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ మాట్లాడుతూ, “బతుకమ్మ కుంట పునరుద్ధరణ భవిష్యత్తులో వందలాది చెరువుల అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇది మన నగరాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దే దిశగా మొదటి మెట్టు” అని అన్నారు.
Read This also…‘Savage Strikers’ Emerges to Empower Next Generation of Women Cricketers..
ఇది కూడా చదవండి…మహిళా క్రికెట్‌లో కొత్త శకం: ‘సావేజ్ స్ట్రైకర్స్’తో యువ కెరటాల ఉప్పెన..
ఇందులో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, హెచ్‌ఎండీఏ వంటి అనేక శాఖల సహకారం వల్లే కుంట రూపుదిద్దుకుంది. కొన్ని విఘ్నాలు ఎదురైనా, వాటిని అధిగమించి చెరువును ప్రజలకు అందించగలగినట్లు తెలిపారు. సెప్టెంబర్ 21న ఇక్కడ బతుకమ్మ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని తెలిపారు.
నలుగురిలో నిలిచే అభివృద్ధి: కలెక్టర్ హరిచందన

హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ, “నలుగురికి చెరువును నమ్మించేలా నిర్మించడం గొప్ప గౌరవం. కేవలం నాలుగు నెలల్లో చెరువును ఈ స్థాయికి తీసుకురావడం దేశంలోనే ఓ రికార్డు” అని అభిప్రాయపడారు. నగరంలోని గొలుసుకట్టు చెరువులు, నాలాల అభివృద్ధిలో హైడ్రా పాత్రను ప్రశంసించారు.
బాల్యాన్ని గుర్తు చేసిన చెరువు: వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు మాట్లాడుతూ, “ఈ చెరువు నా బాల్యాన్ని గుర్తు చేస్తోంది. చిన్నప్పుడు ఇక్కడ బతుకమ్మలు ఆడి, ఈతలాడిన జ్ఞాపకాలు మళ్లీ రివైండ్ అయ్యాయి. 1963 నుంచీ ఈ చెరువును అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. ఈ రోజు అది నెరవేరడం ఆనందంగా ఉంది,” అన్నారు.
హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు కాదు, భవిష్యత్తు నిర్మాణమని ఈ ప్రాజెక్టు స్పష్టం చేస్తోందన్నారు. నగరంలోని అన్ని చెరువులు, వాగులు, వర్షకాలువలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అంతా ఒక్కటై ముందుకు
ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, హైడ్రా అధికారులు అశోక్,పాపయ్య, సుదర్శన్, తిరుమల్, శ్రీకాంత్ మరియు హైడ్రా సిబ్బంది పాల్గొన్నారు. బతుకమ్మ కుంట మోడల్‌గా మారి, నగరంలో మరిన్ని చెరువుల పునరుద్ధరణకు మార్గం సుగమం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తమైంది.
