365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, జ‌న‌వ‌రి 25, 2024: చలన చిత్ర నిర్మాణంలో డైనమిక్ క్వాలిటీ, వినూత్న కథన సాధనకు పేరుగాంచిన లెగసీ కంటెంట్ ప్రొడక్షన్ స్టూడియో బవేజా స్టూడియోస్ లిమిటెడ్ తన ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.97.20 కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తోంది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వారి ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫాంలో పబ్లిక్ ఇష్యూను ప్రారంభించడానికి కంపెనీ ఆమోదం పొందింది. పబ్లిక్ ఇష్యూ జనవరి 29న ప్రారంభమై ఫిబ్రవరి 1న ముగుస్తుంది.

పబ్లిక్ ఇష్యూ ద్వారా సేక‌రించిన‌ మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలతో సహా కంపెనీ విస్తరణ ప్రణాళికలకు వినియోగించనున్నారు.

ఫెడెక్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఇష్యూకు బుక్ ర‌న్నింగ్‌ లీడ్ మేనేజర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

రూ.10 ముఖ విలువ కలిగిన 54 లక్షల ఈక్విటీ షేర్ల ఐపీఓలో 40 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, 14 లక్షల ఈక్విటీ షేర్ల విక్రయ ఆఫర్ ఉన్నాయి.

పబ్లిక్ ఇష్యూ కోసం ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.170-180 ప్రైస్ బ్యాండ్ (ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.160-170 ప్రీమియంతో కలిపి) నిర్ణయించింది. ఒక్కో షేరుకు రూ.180 అధిక ధరతో పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.97.20 కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది.

అప్లికేషన్ కోసం కనీస లాట్ సైజ్ 800 షేర్లు, అంటే ఒక్కో అప్లికేషన్ కు రూ.1.44 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఐపీఓ కోసం రిటైల్ ఇన్వెస్టర్, హెచ్ఎన్ఐ కోటాను ఇష్యూలో వరుసగా 35 శాతం, 15 శాతానికి తగ్గకుండా ఉంచగా, క్యూఐబీ కోటాను ఇష్యూలో గరిష్ఠంగా 50 శాతంగా ఉంచారు.

2001లో హ్యారీ బవేజా, ఆయ‌న‌ భార్య పమ్మీ బవేజా స్థాపించిన బవేజా స్టూడియోస్, చలనచిత్ర నిర్మాణంలో డైనమిక్ నాణ్యత, వినూత్న కథన పద్ధతులకు ప్రసిద్ధి చెందింది.

నిర్మాణ సంస్థగా, బవేజా స్టూడియోస్ లిమిటెడ్ చార్ సాహెబ్ జాదే, లవ్ స్టోరీ 2050, ఖయామత్, భావుకాల్ వంటి అనేక హిందీ, పంజాబీ చిత్రాలను నిర్మించింది.

నిర్మాతల నుంచి రైట్స్ కొనుగోలు చేసి ఎగ్జిబిటర్లు, స్ట్రీమింగ్ ప్లాట్ఫాంల‌కు అమ్మే వ్యాపారంలో కూడా ఈ సంస్థ ఉంది. జూన్ 2023 నాటికి, సంస్థ 22 ప్రాజెక్టులను పూర్తిచేసింది.

6 చిత్రాలు నిర్మాణంలో, మ‌రో 7 ప్రీ-ప్రొడక్షన్లో ఉన్నాయి. విస్తృతమైన ఫిల్మ్ లైబ్రరీ మద్దతుతో హిందీ, పంజాబీ చిత్రాలను రూపొందించిన సుదీర్ఘ చరిత్ర ప్రమోటర్లకు ఉంది.

ఈ సంద‌ర్భంగా బ‌వేజా స్టూడియోస్‌కు చెందిన హ‌ర్మ‌న్ బ‌వేజా మాట్లాడుతూ, “మా వాటాదారులు, పెట్టుబడిదారులతో ఈ ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి మేము ఎంతో ఉద్వేగంగా ఉన్నాము.

సృజనాత్మక హద్దులను మ‌రింత ముందుకు తీసుకెళ్లడం, కొత్త ఉత్పత్తి ప్రమాణాలను ఏర్పాటు చేయడంలో మా నిబద్ధతకు ఈ ఐపీఓ నిదర్శనం.

సేకరించిన మూలధనం కొత్త పరిధులను అన్వేషించడానికి, ప్రతిభను పెంపొందించడానికి, ప్రపంచ ప్రేక్షకులకు అసాధారణ కంటెంట్‌ను అందించడం కొనసాగించడానికి మాకు శక్తినిస్తుంది” అని చెప్పారు.